
D NEWS: పరిశుభ్రమైన సమాజం గాంధీజీ ఆశయమని, ప్రతి పౌరుడు స్వచ్ఛతను బాధ్యతగా భావించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్రావు అన్నారు. మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా చిలకలగూడలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రామచందర్రావు చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా పారిశుధ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోందని తెలిపారు.
స్వాతంత్ర్య సమరంలో మహాత్మా గాంధీ చేసిన సేవలను రామచందర్రావు స్మరించుకున్నారు. ‘జై జవాన్–జై కిసాన్’ నినాదంతో దేశానికి సేవలందించిన లాల్ బహదూర్ శాస్త్రి కృషిని కూడా గుర్తు చేశారు.
పరిశుభ్రత ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదని, ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని రామచందర్రావు సూచించారు. ఇళ్లతో పాటు వీధులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తిక చంద్రారెడ్డి, సికింద్రాబాద్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతను ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకుంటే పరిశుభ్రమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని రామచందర్రావు పేర్కొన్నారు.
