Irumudi Breaks Baahubali 2 Record with Massive 6th Week Collections

D News: బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ జోరు ఇంకా తగ్గడం లేదు. సినిమా విడుదలై ఆరు వారాలు పూర్తయినా థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తెలుగు వెర్షన్‌ సినిమాల ఆరో వారం నెట్‌ వసూళ్లలో ఇరుముడి సరికొత్త రికార్డు సృష్టించింది.

బాహుబలి 2ను దాటేసిన ఇరుముడి

ఆరో వారంలో రూ.3.46 కోట్ల నెట్‌ వసూళ్లు సాధించిన ఇరుముడి.. ఇప్పటివరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ‘బాహుబలి 2’ రికార్డును అధిగమించింది. బాహుబలి 2 ఆరో వారంలో రూ.2.65 కోట్ల నెట్‌ కలెక్షన్స్‌ సాధించగా.. ఇరుముడి దాన్ని దాటి కొత్త రికార్డు నమోదు చేసింది.

దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత తెలుగు వెర్షన్‌ సినిమాల ఆరో వారం వసూళ్లలో ఈ మార్పు చోటుచేసుకోవడం విశేషంగా మారింది.

ఆరో వారంలో టాప్ మూవీస్

ఆరో వారంలో అత్యధిక నెట్‌ వసూళ్లు సాధించిన తెలుగు వెర్షన్‌ సినిమాల జాబితాలో ఇరుముడి రూ.3.46 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. బాహుబలి 2 రూ.2.65 కోట్లతో రెండో స్థానంలో ఉంది.

ఆ తర్వాత ‘మన శంకర వరప్రసాద్’ రూ.2.04 కోట్లు, ‘కల్కి 2898 ఏడీ’ రూ.2.00 కోట్లు, ‘మహావతార్ నరసింహ’ రూ.1.93 కోట్లు, ‘పుష్ప 2’ రూ.1.61 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొంటున్నారు.

సాధారణంగా సినిమా విడుదలైన కొద్ది వారాల తర్వాత వసూళ్లు క్రమంగా తగ్గుతుంటాయి. కానీ ఇరుముడి మాత్రం ఆరో వారంలోనూ బలమైన కలెక్షన్స్‌ సాధించడం ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.

థియేటర్లలో కొనసాగుతున్న జోరు

ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.228 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లలో సినిమాకు ప్రేక్షకుల స్పందన కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే జోరు మరికొన్ని రోజులు కొనసాగితే ఇరుముడి ఖాతాలో మరిన్ని బాక్సాఫీస్‌ రికార్డులు చేరే అవకాశం ఉంది.

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటించగా.. ఆయన కూతురి పాత్రలో బేబీ నక్షత్ర కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

By Avinash