D Educt: Oct 2: విజయవాడ, విశాఖపట్నంలోని అంబేడ్కర్‌ స్టడీ సర్కిళ్లలో ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అందించనున్నారు. ఈ కోచింగ్‌ కోసం అభ్యర్థుల ఎంపికకు నిర్వహించే స్క్రీనింగ్‌ టెస్ట్‌కు అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది.

అర్హత కలిగిన అభ్యర్థులు అక్టోబర్‌ 6 నుంచి 10వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకోసం అంబేడ్కర్‌ స్టడీ సర్కిల్‌ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

అభ్యర్థుల ఎంపిక కోసం అక్టోబర్‌ 15న స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు అంబేడ్కర్‌ స్టడీ సర్కిళ్లలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు ఉచిత రెసిడెన్షియల్‌ కోచింగ్‌ అందించనున్నారు.

మొత్తం 150 సీట్లను ఈ కోచింగ్‌ కోసం కేటాయించారు. ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. కోచింగ్‌ తరగతులు అక్టోబర్‌ 21 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు.