D News: Oct 2: మహారాష్ట్రలోని సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమరావతి జిల్లా ధామన్‌గావ్ రైల్వే సమీపంలో వేగంగా వెళ్తున్న భారీ ట్రక్కు.. దుర్గామాత విగ్రహాన్ని తీసుకెళ్తున్న బొలేరో పికప్ వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు.

దేవీ నవరాత్రుల సందర్భంగా బుల్ధానా జిల్లా షెగావ్ నుంచి దుర్గామాత విగ్రహాన్ని తీసుకుని భక్తులు వార్ధా వైపు బయలుదేరారు. సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేలోని ఛానల్ నంబర్ 97 వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ట్రక్కు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో పికప్ వాహనం పూర్తిగా ధ్వంసమై రోడ్డుపై పల్టీలు కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న భక్తులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.

పండుగ సందర్భంగా ఎంతో భక్తిశ్రద్ధలతో అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాద తీవ్రతకు పికప్ వాహనం భారీగా దెబ్బతినడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, హైవే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను వెంటనే ధామన్‌గావ్ గ్రామీణ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. గాయపడిన వారిలో నలుగురైదుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వార్ధాలోని మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న అమరావతి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ ప్రమాదానికి వాహనాల అతివేగమే కారణమా, లేక ఏదైనా సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.