D Spiritual: Oct 2: కృష్ణానది తీరంలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారు ప్రతిరోజూ ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి విజయదశమి వరకు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను పది విశిష్ట అలంకారాల్లో అలంకరించనున్నారు. ఆలయ అధికారులు ఖరారు చేసిన దర్శనాల షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 11న శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిగా, అక్టోబర్ 12న శ్రీ గాయత్రీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అక్టోబర్ 13న శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారంలో, అక్టోబర్ 14న శ్రీ మహాచండీ దేవి అలంకారంలో అమ్మవారు కొలువుదీరనున్నారు. అక్టోబర్ 15న శ్రీ లలితా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అక్టోబర్ 16న మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవచ్చు. అక్టోబర్ 17న శ్రీ మహాలక్ష్మి దేవిగా, అక్టోబర్ 18న దుర్గాష్టమి సందర్భంగా శ్రీ దుర్గాదేవి అలంకారంలో జగన్మాత భక్తులను అనుగ్రహించనున్నారు.

అక్టోబర్ 19న మహర్నవమి సందర్భంగా శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 20న విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.

మరోవైపు, దసరా ఉత్సవాల ముగింపు రోజైన అక్టోబర్ 20న సాయంత్రం కృష్ణానదిలో అమ్మవారికి హంసవాహనంపై వైభవంగా తెప్పోత్సవం నిర్వహించనున్నారు. శరన్నవరాత్రుల్లో వివిధ అలంకారాల్లో కొలువుదీరే కనకదుర్గమ్మను దర్శించుకోవడం సర్వశుభప్రదమని భక్తుల విశ్వాసం.