Ilaiyaraaja Copyright Case Takes a Key Turn.. Supreme Court Delivers Crucial Verdict!

D News: లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ‘మూడుపాణి’ సినిమాలోని ప్రముఖ పాట ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ కాపీరైట్ వివాదానికి సంబంధించి దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునేంత తప్పిదం కనిపించడం లేదని పేర్కొంది.

అసలు వివాదం ఏంటి?

1980లో విడుదలైన తమిళ చిత్రం **‘మూడుపాణి’**లోని ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాటను మరో సినిమాలో రీక్రియేట్ చేయడంతో ఈ కాపీరైట్ వివాదం మొదలైంది. ‘అఘతీయా’ చిత్రంలో పాటను ఉపయోగించేందుకు ఇళయరాజా నుంచి అనుమతి తీసుకున్నామని సంబంధిత నిర్మాతలు చెప్పగా.. మ్యూజిక్ లేబుల్ సరిగమ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పాటకు సంబంధించిన హక్కులు అసలు నిర్మాత నుంచి తమకు బదిలీ అయ్యాయని సరిగమ వాదించింది.

ఈ వ్యవహారంలో దిల్లీ హైకోర్టు మే 2026లో కీలక తీర్పు ఇచ్చింది. ఇళయరాజాకు పాటలోని మ్యూజికల్ వర్క్ లేదా ట్యూన్‌పై హక్కు ఉందని, అయితే లిరిక్స్, ఒరిజినల్ సౌండ్ రికార్డింగ్‌పై హక్కులు లేవని కోర్టు పేర్కొంది. సౌండ్ రికార్డింగ్‌కు సంబంధించిన హక్కులు సరిగమకు ఉన్నాయని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?

దిల్లీ హైకోర్టు తీర్పుపై ఇళయరాజా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ కూడా తిరస్కరణకు గురికావడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీంకోర్టు కూడా ఈ అప్పీల్‌లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. దీంతో సరిగమకు అనుకూలంగా ఉన్న హైకోర్టు ఆదేశాలు కొనసాగనున్నాయి.

అయితే సుప్రీంకోర్టు మరో విషయాన్ని స్పష్టం చేసింది. దిల్లీ హైకోర్టు తీర్పులోని పరిశీలనలు ఈ దశలో prima facie (ప్రాథమికంగా మాత్రమే) చేసినవని, వాటిని తుది నిర్ణయంగా లేదా ఇతర కేసులకు నేరుగా వర్తించే నజీరుగా పరిగణించరాదని పేర్కొంది.

దీంతో ‘ఎన్ ఇనియ పొన్ నిలవే’ పాటకు సంబంధించిన కాపీరైట్ వివాదం మరోసారి కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

By Avinash