
తల్లికి వందనం రెండో విడత: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంలో రెండో విడత నిధుల విడుదలకు సంబంధించి కీలక చర్యలు చేపట్టింది. ఇప్పటికే మొదటి విడతలో అర్హులైన లబ్ధిదారుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. అయితే సాంకేతిక సమస్యలు, నమోదు ప్రక్రియ పెండింగ్లో ఉండటం, కొత్తగా విద్యార్థులు చేరడం వంటి కారణాలతో మొదటి విడతలో ఆర్థిక సాయం అందని వారికి మరో అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం తుది జాబితాను సిద్ధం చేసింది.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చేరిన విద్యార్థులతో పాటు, మొదటి విడతలో అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా నగదు అందని విద్యార్థులకు రెండో విడతలో ప్రయోజనం కల్పించనున్నారు. ముఖ్యంగా ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తించనుంది.
జూలై 22న మొదటి విడత కింద 64.76 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. అనంతరం పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తవడం, విద్యార్థుల డేటాలో మార్పులు, రికార్డుల సవరణలు వంటి ప్రక్రియలు పూర్తయ్యాయి. వీటితో పాటు మరో 2.7 లక్షల నుంచి 3 లక్షల మంది విద్యార్థులు రెండో విడత సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
మొదటి విడతలో నగదు అందని అర్హుల నుంచి ప్రభుత్వం అభ్యంతరాలు, వినతులను స్వీకరించింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లబ్ధిదారుల అర్హతలను పరిశీలించి, క్షేత్రస్థాయిలో రీ-వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం అర్హుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శించారు.
రెండో విడత నిధుల విడుదలకు సంబంధించిన ఫైలుకు ఆర్థిక శాఖ ఇటీవల ఆమోదం తెలిపింది. ప్రస్తుతం తుది అనుమతి కోసం ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) చేరినట్లు సమాచారం. సీఎంవో నుంచి ఆమోదం లభించిన అనంతరం నిధుల విడుదల తేదీని ఖరారు చేసి, అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.
పథకం మార్గదర్శకాల ప్రకారం, పాఠశాల మౌలిక వసతుల కోసం మినహాయించే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఒక్కో అర్హత కలిగిన విద్యార్థికి నికరంగా రూ.13,000 చొప్పున వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా జమ చేయనున్నారు. రెండో విడత పంపిణీ పూర్తయితే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 68 లక్షల మంది విద్యార్థులకు ‘తల్లికి వందనం’ పథకం ద్వారా ప్రయోజనం అందినట్లవుతుందని అధికారులు తెలిపారు.
