D Spiritual: Oct 1: బంగారు వాహనాల సమర్పణ: శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి బంగారు పూత పూసిన గజ వాహనం, సింహ వాహనాలను దాతలు విరాళంగా సమర్పించారు. బుధవారం ఉదయం ఆలయ వాహన మండపం వద్ద దాతలు ఈ వాహనాలను ఆలయ అధికారులకు అందజేశారు.

హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి పి.వి. లక్ష్మీ రెడ్డి సింహ వాహనాన్ని, శ్రీమతి పి.వి. దివ్య ప్రియాంక గజ వాహనాన్ని ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో శ్రీ వరలక్ష్మీకి అందజేశారు. సుమారు రూ.40 లక్షల విలువైన ఈ రెండు బంగారు పూత పూసిన వాహనాలను దాతలు స్వామివారి సేవ కోసం సమర్పించారు. రానున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఈ వాహనాలను వినియోగించనున్నారు.

ఈ సందర్భంగా వాహన మండపంలో గజ వాహనం, సింహ వాహనాలకు ఆలయ అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పమాలలు సమర్పించారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. స్వామివారి సేవకు వాహనాలను సమర్పించడం పట్ల దాతలు భక్తి, ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అనంతరం దాతలకు శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పించారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ గోపినాథ్, సూపరింటెండెంట్ శ్రీ రాజ్ కుమార్, ఆలయ అర్చకులు శ్రీ బాలాజీ దీక్షితులు, శ్రీ నారాయణ చార్యులు, ఇతర అర్చకులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.