
D NEWS: రాష్ట్ర సచివాలయం నిరసనలకు వేదికగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. పెండింగ్ బిల్లుల కోసం రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న కాంట్రాక్టర్లు ఆందోళన చేయడంపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ బిల్లుల కోసం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్ రావు ఆరోపించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ చిన్న కాంట్రాక్టర్లను పట్టించుకోవడం లేదని విమర్శించారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్లో పెట్టడం దారుణమన్నారు.
బిల్లుల మంజూరుకు 20 నుంచి 30 శాతం కమిషన్ అడుగుతున్నారనే ఆరోపణలను ఆయన ప్రస్తావించారు. కమిషన్లు ఇవ్వలేదనే కారణంతోనే బిల్లులు నిలిపివేస్తున్నారా అని ప్రశ్నించారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గతంలో ఇచ్చిన హామీలను హరీశ్ రావు గుర్తు చేశారు. 2024 మార్చి నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బెనిఫిట్స్ అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
ప్రజల సమస్యలు వినాల్సిన ప్రభుత్వం వారినే పోలీసులతో అడ్డుకోవడం ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇదేనా ప్రజా పాలన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పెండింగ్ బిల్లులు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
