Suriya’s Fun Counter to Rajamouli Goes Viral at Don’t Trouble the Trouble Event

D News : స్టార్ హీరో సూర్య, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకు పండగే. తాజాగా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా వేడుకలో వీరిద్దరి మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ చిత్రానికి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్య తనదైన శైలిలో జక్కన్నకు కౌంటర్ ఇచ్చారు.

‘సీనియర్ నేనే’ అంటూ సరదా పంచ్

దర్శకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రాజమౌళికి సూర్య అభినందనలు తెలిపారు. అయితే ఇండస్ట్రీ అనుభవం విషయంలో మాత్రం తనదే పైచేయి అంటూ నవ్వులు పూయించారు. రాజమౌళిని ‘సర్’ అని గౌరవంగా పిలుస్తున్నప్పటికీ.. సినీ పరిశ్రమలో తనకు దాదాపు 28–29 ఏళ్ల అనుభవం ఉందని సరదాగా గుర్తుచేశారు. దీంతో వేదికపై ఉన్న రాజమౌళితో పాటు అక్కడి ప్రేక్షకులు కూడా నవ్వుకున్నారు.

రాజమౌళి సినిమాలో ఛాన్స్ కావాలంటూ!

అంతటితో ఆగని సూర్య.. ‘కల్కి’లో రాజమౌళి చేసిన అతిథి పాత్రను ప్రస్తావిస్తూ మరో చమత్కారం చేశారు. ఏదో ఒక రోజు రాజమౌళి దర్శకత్వంలో తనకు కూడా చిన్న క్యామియో అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నానని అన్నారు.

ఆ తర్వాత రాజమౌళి సినీ ప్రయాణాన్ని సూర్య ప్రశంసించారు. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన చేసిన కృషిని కొనియాడారు. కథ ఏ స్థాయిలో ఉన్నా ప్రేక్షకులను థియేటర్‌లో కట్టిపడేసేలా చేయగల విజన్ రాజమౌళి సొంతమని పేర్కొన్నారు. కొత్త తరహా కథలు, ప్రతిభావంతులను ప్రోత్సహించడంలోనూ ఆయన ముందుంటారని సూర్య ప్రశంసించారు.

సూర్య చేసిన సరదా వ్యాఖ్యలు, రాజమౌళిపై ఆయన చేసిన ప్రశంసలు కలగలిపిన ఈ స్పీచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

By Avinash