D NEWS: అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘తొలిముద్ద’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ములుగు జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మూడు నుంచి ఆరు సంవత్సరాల చిన్నారుల సంపూర్ణ వికాసమే లక్ష్యమని మంత్రి సీతక్క తెలిపారు.

ములుగు మండలం జగ్గయ్యపేటలో మంత్రి సీతక్క ప్రధానమంత్రి సూర్యఘర్ ఉచిత విద్యుత్ సోలార్ ప్లాంట్లను ప్రారంభించారు. రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా భవనాన్ని కూడా ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘తొలిముద్ద’ అల్పాహార కార్యక్రమంలో పాల్గొన్నారు.

అక్టోబర్ 1 నుంచి అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టిక అల్పాహారం అందించనున్నట్లు సీతక్క తెలిపారు. ఒక రోజు గుడ్డుతో ఉప్మా, మరో రోజు కిచిడీ అందిస్తామని చెప్పారు. ములుగు జిల్లాలో ఇప్పటికే రోజూ 100 మిల్లీలీటర్ల పాలు అందిస్తున్నట్లు వివరించారు.

పాలు, గుడ్లు, అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో చిన్నారులకు మెరుగైన పోషకాహారం అందుతుందని మంత్రి తెలిపారు. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు బాలామృతం, బాలామృతం ప్లస్ అందిస్తున్నట్లు చెప్పారు. పౌష్టికాహారంతో పాటు ఆటపాటలు, పూర్వ ప్రాథమిక విద్య కూడా అవసరమని పేర్కొన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్య అందించాలని సీతక్క సూచించారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించి పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు పంపేలా ప్రోత్సహించాలని చెప్పారు. చిన్నారుల ఆరోగ్యం, విద్య, సంపూర్ణ వికాసానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.