
ఉగ్రవాదంపై భారత్ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అనుసరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద చర్యలకు పాల్పడితే దీటైన సమాధానం ఇస్తామని తేల్చిచెప్పారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలాకోట్ వైమానిక దాడి 2025లో ఆపరేషన్ సిందూర్‌ను ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఆదివారం ప్రసారమైన 138వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశ భద్రతతో పాటు జనగణన, పర్యావరణ పరిరక్షణ, పోషకాహారం, యువత, క్రీడలు, సాంస్కృతిక వారసత్వం తదితర అంశాలపై ప్రధాని మాట్లాడారు. జనగణనను జాతీయ బాధ్యతగా అభివర్ణించిన ఆయన ఈ ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
గుజరాత్‌లోని మొధేరా గురించి ప్రస్తావిస్తూ సూర్యారాధన భారతీయ సంప్రదాయంలో ఆలయాలు నిర్మాణాలకే పరిమితం కాదని మోదీ అన్నారు. కాంతి, శక్తి, విజ్ఞానంతో పాటు నిరంతర ప్రగతికి సూర్యుడు ప్రతీకగా నిలుస్తాడని పేర్కొన్నారు. దేశంలో తొలి సౌర గ్రామంగా మొధేరా గుర్తింపు పొందిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
అస్సాంలో వన్యప్రాణుల సంరక్షణ అంతరించిపోయే ప్రమాదం ఉన్న పిగ్మీ హాగ్ పరిరక్షణకు జరుగుతున్న ప్రయత్నాలపై కూడా ప్రధాని మాట్లాడారు. సుందర్‌బన్స్‌లో మహిళలు మడ అడవులను పెంచుతూ తమ గ్రామాలను రక్షించుకోవడంతో పాటు ఉపాధి అవకాశాలను పొందుతున్నారని తెలిపారు.
‘నషా ముక్త్ యువ అభియాన్’ ద్వారా యువత మాదకద్రవ్యాల వ్యసనానికి వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తున్నారని మోదీ చెప్పారు. వ్యసనంతో బాధపడుతున్న వారిని దూరం చేయకుండా వారికి అండగా నిలిచి ఆ సమస్య నుంచి బయటపడేందుకు సహకరించాలని సూచించారు.
