జాతీయ భద్రత విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్‌పై పొరుగుదేశం ఉగ్రవాదులను ప్రోత్సహించినంతకాలం తగిన రీతిలో గట్టిగా బదులిస్తామని పాకిస్తాన్‌ను ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరించారు. ఓ టీవీ చానల్ నిర్వహించిన డిఫెన్స్ సమిట్‌–2026లో ఆయన మాట్లాడారు.

భారత్ మొదటి నుంచీ శాంతినే కోరుకుంటోందని యుద్ధాన్ని కోరుకోవడం లేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఇతర దేశాల భూభాగంపై భారత్ ఎప్పుడూ కన్నేయలేదని పేర్కొన్నారు. అయితే శాంతిని కోరుకోవడం బలహీనతకు సంకేతం కాదని స్పష్టం చేశారు.

‘‘భారత్ శాంతిని కోరుకుంటుంది యుద్ధాన్ని కాదు. ఏ దేశ భూభాగంపైనా కన్నేయదు. అయితే శాంతియుత వాతావరణాన్ని కోరుకున్నంత మాత్రాన మనం బలహీనులమని కాదు. శాంతికి బలహీనతకు మధ్య తేడా ఉంది. జాతీయ భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. దేశంపై మరోసారి ఉగ్రదాడికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి’’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

పొరుగుదేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే, ఉగ్రవాదులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని పొరుగుదేశంతో పాటు ప్రపంచానికి కూడా స్పష్టం చేయాలనుకుంటున్నామని చెప్పారు.

భారత్ సాధారణంగా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తుందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. అయితే ఏదైనా దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే అలాంటి పరిస్థితుల్లో చర్చలకు అక్కడికక్కడే తెరపడుతుందని అన్నారు. జాతీయ భద్రతను పణంగా పెట్టి పొరుగుదేశం నుంచి సహకారాన్ని కోరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

By Rajini