
D News : హీరో, దర్శకుడి మధ్య షూటింగ్ సమయంలో విభేదాలు రావడం సాధారణమే. అయితే ‘ది ప్యారడైజ్’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాత్రం నానితో తనకు గొడవలు జరిగిన విషయాన్ని దాచకుండా స్వయంగా వెల్లడించారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. షూటింగ్ సమయంలో నాని తనను తిట్టిన సందర్భాలు ఉన్నాయని, తాను కూడా నానితో కొన్ని మాటలు మాట్లాడినట్లు తెలిపారు.
“మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి”
‘ది ప్యారడైజ్’ షూటింగ్ సమయంలో తమ మధ్య వాగ్వాదాలు జరిగిన మాట వాస్తవమేనని శ్రీకాంత్ ఓదెల చెప్పారు. సినిమా తెరకెక్కించే క్రమంలో నానికి కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయని, తనకు కూడా కోపం వచ్చి నానితో వాదించినట్లు తెలిపారు. అయితే ఈ గొడవలను వ్యక్తిగత విభేదాలుగా చూడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
“నాని అన్న నన్ను భరించాల్సిందే”
నాని తనను ఇండస్ట్రీకి తీసుకొచ్చి దర్శకుడిగా నిలబెట్టారని శ్రీకాంత్ ఓదెల భావోద్వేగంగా చెప్పారు. అందుకే తమ మధ్య ఎన్ని గొడవలు, వాగ్వాదాలు జరిగినా అనుబంధం మాత్రం ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపారు.
తమ బంధంలో తిట్లు, గొడవలు ఉన్నప్పటికీ అదే స్థాయిలో ప్రేమ, ఆప్యాయత కూడా ఉందని ఓదెల చెప్పుకొచ్చారు. ‘దసరా’తో మొదలైన తమ ప్రయాణం ‘ది ప్యారడైజ్’ వరకు వచ్చిందని, తమ అనుబంధం కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాదని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.
శ్రీకాంత్ ఓదెల చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం నాని అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి.
