
D Educt: Sept 26: సర్టిఫికెట్ల పరిశీలనకు ఏపీడిజీవెరిఫై
సర్టిఫికెట్ల పరిశీలన పేరుతో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం అన్ని రకాల ధ్రువపత్రాలను ఏపీడిజీవెరిఫైలో భద్రపరుస్తోంది. పాత రికార్డులతో పాటు రియల్‌టైమ్ డేటాను కూడా ఇందులో నిక్షిప్తం చేస్తోంది. సర్టిఫికెట్లలో ఎప్పుడైనా మార్పులు జరిగితే ఆ వివరాలు వెంటనే సిస్టమ్‌లో అప్డేట్ అయ్యేలా వ్యవస్థను రూపొందించింది.
ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలు సర్టిఫికెట్లను పరిశీలించేందుకు వీలుగా ఈ డేటాను అందుబాటులో ఉంచింది. డేటాను ఎవరూ హ్యాక్ చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం బ్లాక్‌చైన్ టెక్నాలజీని వినియోగిస్తోంది. దీంతో విద్యార్థులు సమర్పించే సర్టిఫికెట్ ఒరిజినల్‌దా, కాదా అనే విషయాన్ని సులభంగా నిర్ధారించవచ్చు.
డిజీవెరిఫైలో భారీగా పదో తరగతి మెమోలు
2004 నుంచి ఇప్పటివరకు జారీ చేసిన 1.81 కోట్ల పదో తరగతి మెమోలను డిజీవెరిఫైలో భద్రపరిచారు. ఈ ఏడాది నుంచి పదో తరగతి మెమోలపై క్యూఆర్ కోడ్‌ను ముద్రిస్తున్నారు. దాన్ని స్కాన్ చేస్తే నేరుగా ఏపీడిజీవెరిఫై పోర్టల్‌కు వెళ్లేలా ఏర్పాటు చేశారు. దీంతో సంబంధిత సర్టిఫికెట్ అసలైనదో కాదో సులభంగా తెలుసుకోవచ్చు.
ఇంటర్మీడియట్‌కు సంబంధించి 2006 నుంచి 2025 వరకు జారీ చేసిన 1.22 కోట్ల సర్టిఫికెట్లను పోర్టల్‌లో భద్రపరిచారు. పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన 4.03 లక్షల సర్టిఫికెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఈ పోర్టల్‌లో 7.99 లక్షల సదరం ధ్రువపత్రాలను సైతం భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు.
