D NEWS: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

కేసీఆర్ హయాంలో రూ.2 వేల పింఛన్ అందుకున్న 46 లక్షల మంది వృద్ధులు, ఇతర లబ్ధిదారులు ఆయనను గుర్తు చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. అలాగే ఇంటింటికీ నల్లా నీరు అందించిన పథకాలను ప్రస్తావిస్తూ.. నీటి బొట్టులో కూడా కేసీఆర్ కనిపిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు.

కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని కేటీఆర్ పేర్కొన్నారు. పెళ్లి సమయంలో రూ.లక్ష సాయం అందుకున్న తల్లిదండ్రులు కేసీఆర్‌ను మేనమామలా గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.

గోదావరి జలాలను కాళేశ్వరం ద్వారా పలు ప్రాంతాలకు తరలించిన విషయాన్ని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. డోర్నకల్, మహబూబాబాద్ నుంచి కోదాడ, సూర్యాపేట వరకు సాగునీటి ప్రయోజనాలు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు కూడా కేసీఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు.

రైతుబంధు చెల్లింపుల విషయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు చేశారు. కేసీఆర్ హయాంలో నాట్ల సమయానికి రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవని, ఇప్పుడు చెల్లింపుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌ను విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయిస్తోందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌కు ప్రజల మద్దతు కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.