D NEWS: తెలంగాణ రక్షణ సేన ఖైరతాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె ప్రభుత్వ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఫామ్‌హౌస్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని కవిత ఆరోపించారు. ఫామ్‌హౌస్‌లపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం మాటలకే పరిమితమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అన్నారు.

మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నారుల మరణాలపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీఐ ద్వారా సేకరించిన సమాచారంగా పేర్కొంటూ 2020-21లో 6,239 మంది, 2021-22లో 4,993 మంది, 2024-25లో 3,853 మంది చిన్నారులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరణించారని తెలిపారు. హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో గత ఏడాది 1,046 మంది చిన్నారులు మరణించారని ఆమె పేర్కొన్నారు.

ఆరోగ్య రంగానికి ప్రభుత్వం కేటాయిస్తున్న బడ్జెట్‌పై కూడా కవిత ప్రశ్నలు లేవనెత్తారు. ఆదిలాబాద్ రిమ్స్ ఘటన తర్వాత కూడా ఆసుపత్రుల్లో పరిశుభ్రతపై తగిన చర్యలు లేవని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్యలను గుర్తించి ప్రజలు ఫొటోలు, వీడియోల ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని యువతకు పిలుపునిచ్చారు.

విద్యా రంగంపైనా కవిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలల్లో బాత్‌రూమ్‌ల వంటి మౌలిక సదుపాయాల కొరతను గుర్తించాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. అవసరమైతే పార్టీ నిధులతో టాయిలెట్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.