
D News : యంగ్ హీరో శ్రీవిష్ణు నటిస్తున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమా రిలీజ్పై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. అక్టోబర్ 9న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. అయితే అదే రోజున సీనియర్ హీరో వెంకటేష్ నటించిన ‘ఆదర్శ కుటుంబం’ విడుదల కానుండటంతో ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా పడే అవకాశాలపై టాలీవుడ్లో చర్చ జరుగుతోంది.
ముందుగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ‘ఆదర్శ కుటుంబం’ విడుదల కావాల్సి ఉంది. అయితే ఆ సినిమా వారం రోజులు ఆలస్యంగా అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్టోబర్ 9న ఇప్పటికే డేట్ లాక్ చేసుకున్న ‘కామ్రేడ్ కళ్యాణ్’కు థియేటర్ల విషయంలో పోటీ ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది.
సెన్సార్ అంశం కూడా కీలకమే
‘కామ్రేడ్ కళ్యాణ్’ ఇప్పటికే సెన్సార్ రివైజింగ్ కమిటీకి వెళ్లినట్లు సమాచారం. దీంతో సినిమా అనుకున్న తేదీకి వస్తుందా లేదా అనే సందేహాలు ముందుగానే వ్యక్తమయ్యాయి. సెన్సార్ ప్రక్రియ పూర్తయినా.. అదే రోజున ‘ఆదర్శ కుటుంబం’తో పోటీ పడాల్సి రావడంతో రిలీజ్ డేట్పై మేకర్స్ మరోసారి ఆలోచించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
అక్టోబర్ 9 నుంచి తప్పుకుని మరో వారం తర్వాత సినిమాను విడుదల చేయాలనుకున్నా పరిస్థితులు అనుకూలంగా కనిపించడం లేదు. అక్టోబర్ 15న ‘జైలర్ 2’, అక్టోబర్ 16న ‘రణబాలి’ వంటి సినిమాలు వరుసగా బరిలోకి రానున్న నేపథ్యంలో ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మరో కొత్త రిలీజ్ డేట్ వెతకాల్సిన పరిస్థితి రావచ్చనే అంచనాలు ఉన్నాయి.
చిన్న సినిమాలకు ఊరట
మరోవైపు ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ 2 నుంచి వాయిదా పడటం కొన్ని చిన్న సినిమాలకు కలిసొచ్చే అంశంగా మారింది. రాజమౌళి ప్రెజెంటర్గా వ్యవహరిస్తున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’కు పెద్ద పోటీ తగ్గడంతో థియేటర్ల విషయంలో కొంత వెసులుబాటు లభించనుంది. ఫహద్ ఫాజిల్ నటిస్తున్న ఈ సినిమా తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతోంది.
అదే సమయంలో విజయ్ కుమారుడు జాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కూడా అదే సమయంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు ‘తెల్ల కాగితం’ వంటి చిన్న సినిమాలకు కూడా ఎక్కువ థియేటర్లు దక్కే అవకాశం ఏర్పడింది.
అయితే ‘కామ్రేడ్ కళ్యాణ్’ విషయంలో తుది నిర్ణయం మేకర్స్ తీసుకోవాల్సి ఉంది. సెన్సార్ ప్రక్రియ, థియేటర్ల లభ్యత, ఇతర సినిమాల రిలీజ్ డేట్లను బట్టి శ్రీవిష్ణు సినిమా కొత్త తేదీకి మారుతుందా లేదా అనేది త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
