
గోదావరి, దేవాదుల ప్రాజెక్టు నీటిని సంపూర్ణంగా వినియోగించుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల ప్రాజెక్టు నీటిని తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
బుధవారం సూర్యాపేట జిల్లాలో పర్యటించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 365 టీఎంసీల నీటిని చుక్క నీరు కూడా వృథా కాకుండా వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
దేవాదుల ప్రాజెక్టు ద్వారా మొత్తం 768 టీఎంసీల నీటి లభ్యత ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో 465 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు మరో 365 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకుంటాయని వెల్లడించారు.
ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులకు మరమ్మతులు చేపట్టేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అధికారంలో ఉన్నా లేకున్నా తన తండ్రి కోరిక మేరకు తాటిపాముల గ్రామాన్ని తన శక్తి మేరకు అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
