
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో విద్యుత్ కోతలు పెరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ సమస్యలు తప్పవని తాము గతంలోనే హెచ్చరించామని ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొందని అన్నారు.
బుధవారం హైదరాబాద్లో మాట్లాడిన కేటీఆర్ విద్యుత్ కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రోజులో కనీసం ఆరు గంటలు కూడా విద్యుత్ సరఫరా ఉండటం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ సమస్యలకు ఎల్నినో ప్రభావం కారణం కాదని కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలే కారణమని ఎద్దేవా చేశారు.
థర్మల్ పవర్ స్టేషన్లకు అవసరమైన బొగ్గును కూడా ప్రభుత్వం సమకూర్చలేకపోతోందని కేటీఆర్ విమర్శించారు. సోషల్ మీడియాలో 1980 నాటి ఫొటోలు ట్రెండ్ అవుతుంటే తెలంగాణలో మాత్రం 1980 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని కేటీఆర్ తెలిపారు.
వ్యవసాయం పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ సరఫరా అందించామని పేర్కొన్నారు. విద్యుత్ సమస్యనే ప్రధాన అంశంగా తీసుకుని తమ మలి దశ ఉద్యమం కొనసాగిందని గుర్తుచేశారు. తెలంగాణలో అద్భుతమైన విద్యుత్ వ్యవస్థను బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రూపొందించారని కేటీఆర్ పేర్కొన్నారు.
