ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పసికందుల మృతి.. కవిత సంచలన ఆరోపణలు

D NEWS: ఆదిలాబాద్ రిమ్స్ ఎస్‌ఎన్‌సీయూలో జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఐదుగురు శిశువుల మృతి అత్యంత బాధాకరమని ఆమె అన్నారు. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కారణమైందని కవిత ఆరోపించారు.
కవిత రిమ్స్‌లోని ఎస్ఎన్సీయూ వార్డును పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, శానిటేషన్ సిబ్బంది కొరత ఉందని ఆమె ఆరోపించారు. గత ఏడాది 204 మంది, అంతకుముందు ఏడాది 174 మంది చిన్నారులు మృతి చెందినట్లు కవిత పేర్కొన్నారు.
రిమ్స్ నిర్వహణపై కవిత ప్రశ్నలు
రిమ్స్‌లో సుమారు 150 ఏసీలు ఉన్నప్పటికీ వాటి నిర్వహణకు మెకానిక్ లేరని కవిత ఆరోపించారు. ఆసుపత్రిలో ముగ్గురు ఎలక్ట్రీషియన్లు మాత్రమే ఉన్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద సుమారు రూ.500 కోట్ల బకాయిలు ఉన్నాయని కూడా ఆమె పేర్కొన్నారు.
బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల పరిహారం
మృతిచెందిన ప్రతి శిశువు కుటుంబానికి రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఆదిలాబాద్ వచ్చి రిమ్స్ పరిస్థితులను పరిశీలించాలని కోరారు. ఆరోగ్యశాఖ మంత్రి పర్యటనపై కూడా ఆమె విమర్శలు చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫోరెన్సిక్ ఆడిట్ డిమాండ్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. విద్యుత్, ఏసీ వ్యవస్థలు, ఫైర్ సేఫ్టీ, అత్యవసర తరలింపు ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించాలని కోరారు. ఆదిలాబాద్ ఆరోగ్య పరిస్థితిపై తమ పార్టీ తరఫున ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేస్తామని తెలిపారు.
నెల రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని డెడ్‌లైన్
రిమ్స్ పెండింగ్ బిల్లులు చెల్లించడంతో పాటు ఆదివాసీ ప్రాంతాలకు రహదారులు నిర్మించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి నెల రోజుల సమయం ఇస్తున్నామని ప్రకటించారు. గడువులోగా సమస్యలు పరిష్కరించకపోతే ఆదివాసీలతో కలిసి ఆదిలాబాద్‌ను ఘెరావ్ చేస్తామని హెచ్చరించారు.
