
D NEWS: తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం అమలుపై రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం జరిగింది. సచివాలయంలో జరిగిన భేటీలో కేసుల దర్యాప్తు, పరిష్కారంపై సీఎం సమీక్షించారు.
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలని రేవంత్‌రెడ్డి సూచించారు. దర్యాప్తు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని ఆదేశించారు.
అలాగే, బాధితులకు అందుతున్న నష్టపరిహారం, ఆర్థిక సహాయం, పునరావాస చర్యలపై సీఎం ఆరా తీశారు. ప్రత్యేక కోర్టులు, మొబైల్ కోర్టుల పనితీరును సమీక్షించారు. కేసుల పరిష్కారంలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇక ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి అధికారులకు కూడా చట్టంపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. బాధితులకు సకాలంలో న్యాయం, సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం అధ్యక్షతన ఈ స్థాయి కమిటీ సమావేశం జరగడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఫిబ్రవరి 11న ఈ కమిటీ చివరిసారిగా సమావేశమైందని పేర్కొన్నారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
