D Educt: Sept 21: కాలపరిమితి, నాణ్యత, సాంకేతికతలో మార్పులు అవసరం

కాలపరిమితి, నాణ్యత, సాంకేతికతలో అవసరమైన మార్పులు రాకపోతే లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుపై ప్రభావం పడే అవకాశం ఉంది. విద్యకు వయసు, వృత్తి, ఆర్థిక పరిస్థితులు అడ్డంకులు కాకూడదు. చదువుకోవాలనే తపన ఉన్న ప్రతి ఒక్కరికీ మరో అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఏర్పడిన దూరవిద్య వ్యవస్థ ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది.

ఉద్యోగులు, గృహిణులు, గ్రామీణ ప్రాంతాల యువత, కుటుంబ బాధ్యతల కారణంగా రెగ్యులర్ కళాశాలకు వెళ్లలేని వారికి ఉన్నత విద్యను కొనసాగించేందుకు దూరవిద్య ప్రధాన మార్గంగా మారింది. అయితే వ్యవస్థలో ఏర్పడుతున్న జాప్యాలు, పరిపాలనా లోపాలు, పరీక్షలు, ఫలితాల విడుదలలో ఆలస్యం వంటి సమస్యలు దూరవిద్య అసలు లక్ష్యానికే విఘాతం కలిగిస్తున్నాయి.

ప్రత్యేకించి ఓపెన్ యూనివర్సిటీల్లో కోర్సుల నిర్వహణలో జాప్యం, నిర్ణీత కాలవ్యవధిలో విద్య పూర్తికాకపోవడం, పరీక్షల షెడ్యూల్‌లో అనిశ్చితి, ఫలితాల విడుదల ఆలస్యం వంటి అంశాలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

దూరవిద్యను ఎంచుకునే విద్యార్థుల్లో చాలామంది ఉద్యోగులు లేదా ఇతర బాధ్యతలు నిర్వహిస్తున్నవారే. వారికి విద్యా క్యాలెండర్ స్పష్టంగా లేకపోతే ఉద్యోగోన్నతులు, పోటీ పరీక్షలు, తదుపరి ఉన్నత విద్య ప్రవేశాలు వంటి అనేక అవకాశాలపై ప్రభావం పడుతుంది. అందువల్ల దీనిని కేవలం ఒక విశ్వవిద్యాలయానికి సంబంధించిన సమస్యగా చూడాల్సిన అవసరం లేదు.

ప్రాదేశిక పరిధి నిబంధనలు

దూరవిద్య దేశవ్యాప్తంగా ఉన్నత విద్యను విస్తరించేందుకు కీలకమైన సాధనం. యూజీసీ కూడా ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ వ్యవస్థను సమాజంలోని విభిన్న వర్గాలకు విద్యను అందించే ముఖ్యమైన విధానంగా గుర్తిస్తోంది.

గుర్తింపు పొందిన సంస్థల్లో, నిబంధనలకు అనుగుణంగా పూర్తిచేసిన ఓడీఎల్ డిగ్రీలను సంబంధిత సంప్రదాయ డిగ్రీలకు సమానంగా పరిగణించవచ్చని యూజీసీ స్పష్టం చేసింది. దూరవిద్య (ఓడీఎల్) కార్యక్రమాల నిర్వహణకు యూజీసీ ప్రాదేశిక పరిధి నిబంధనలు విధించింది.

రాష్ట్ర చట్టం ద్వారా ఏర్పడిన యూనివర్సిటీలు తమకు నిర్దేశించిన పరిధిలోనే స్టడీ సెంటర్లు, లెర్నర్ సపోర్ట్ సెంటర్లు, సంప్రదింపుల తరగతులు, పరీక్షలు తదితర కార్యకలాపాలు నిర్వహించాలి. ఈ నిబంధనల ఉద్దేశం దూరవిద్యలో నాణ్యత, పర్యవేక్షణ, జవాబుదారీతనం పెంచడమే.

అయితే ప్రాదేశిక పరిధి నిబంధనల కారణంగా వివిధ రాష్ట్రాల్లోని స్టడీ సెంటర్లను తొలగించడంతో విశ్వవిద్యాలయాలకు ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో స్టడీ సెంటర్లు ఉన్నప్పుడు అడ్మిషన్లు ఎక్కువగా ఉండేవని, 2014 తర్వాత అడ్మిషన్లు తగ్గాయని చెప్పవచ్చు. దూరవిద్య అంటే నాణ్యతలో రాజీ పడే విద్య అనే భావన పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది.

సమయపాలనతో నిర్వహించాలి

రెగ్యులర్ విద్యార్థులకు అందే విద్యా ప్రమాణాలు, అకడమిక్ క్యాలెండర్, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, ధ్రువపత్రాల జారీ వంటి అంశాల్లో దూరవిద్య విద్యార్థుల పట్ల కూడా అదే స్థాయి బాధ్యత ఉండాలి.

ముఖ్యంగా ప్రతి విద్యా సంవత్సరానికి ముందుగానే పూర్తి అకడమిక్ క్యాలెండర్‌ను ప్రకటించి, ప్రవేశాలు, అసైన్‌మెంట్లు, కౌన్సెలింగ్, పరీక్షలు, ఫలితాలు, సర్టిఫికెట్ల జారీ వరకు అన్ని ప్రక్రియలను సమయపాలనతో నిర్వహించాలి.

సాంకేతికతను సమర్థంగా వినియోగించడం మరో ముఖ్యమైన అవసరం. ముద్రిత పాఠ్యపుస్తకాలతో పాటు డిజిటల్ స్టడీ మెటీరియల్, వీడియో తరగతులు, ఆన్‌లైన్ కౌన్సెలింగ్, మొబైల్ యాప్, పరీక్షల సమాచారం, ఫలితాల ట్రాకింగ్, విద్యార్థుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అందుబాటులో ఉండాలి.

గ్రామీణ ప్రాంత విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని తక్కువ డేటాతో పనిచేసే డిజిటల్ వేదికలను కూడా అందుబాటులోకి తీసుకురావాలి. అదే సమయంలో విద్యార్థులు కూడా అప్రమత్తంగా ఉండాలి.

ఏదైనా దూరవిద్య కోర్సులో చేరే ముందు ఆ విద్యాసంస్థకు, ఆ నిర్దిష్ట కోర్సుకు సంబంధిత విద్యా సంవత్సరానికి యూజీసీ డీఈబీ గుర్తింపు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించాలి. గత సంవత్సరంలో ఉన్న గుర్తింపు తదుపరి సంవత్సరానికీ స్వయంచాలకంగా వర్తించదని యూజీసీ స్పష్టం చేస్తోంది.

విద్యార్థుల సమయం, శ్రమకు విలువ ఇవ్వాలి

దూరవిద్య ప్రత్యామ్నాయ విద్య కాదు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మందికి ఇది ప్రధాన విద్యామార్గం. అందుకే విద్యార్థుల సమయం, శ్రమ, డబ్బు విలువను గుర్తించి విశ్వవిద్యాలయాలు పనిచేయాలి.

విద్యార్థి ఒకసారి ఫీజు చెల్లించి ప్రవేశం పొందిన తర్వాత అతని బాధ్యత అక్కడితో ముగియదు. అదే విధంగా విశ్వవిద్యాలయం బాధ్యత కూడా ఫీజు వసూళ్లతో ముగియకూడదు. సమయానికి కోర్సు, సమయానికి పరీక్ష, సమయానికి ఫలితం, సమయానికి ధ్రువపత్రం.. ఇదే దూరవిద్యకు కావాల్సిన కొత్త ప్రమాణం.

విద్యార్థుల భవిష్యత్తును ఆలస్యాల బారిన పడనివ్వకుండా పరిపాలనా సంస్కరణలు, సాంకేతిక ఆధునీకరణ, పారదర్శకత, జవాబుదారీతనం పెంచితేనే దూరవిద్య తన అసలు లక్ష్యాన్ని సాధిస్తుంది. లేకపోతే విద్యార్థులకు అండగా నిలవాల్సిన ‘రెండో అవకాశం’ వారి జీవితంలో మరో ‘వేచిచూసే అవకాశం’గా మిగిలిపోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana