
D News: Sept 21: మంచి పాలన అనేది కేవలం రాజకీయ నాయకులు, పార్టీల సొత్తు అనుకుంటే ప్రజలు చేసేదేమీ ఉండదు. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? ఎప్పుడు ఈ పాలకులను ఓడించాలా? అని ఎదురు చూడటమే వారి పనిగా మారుతుంది. ఇలాంటి ప్రజాస్వామ్యంలో కనీసం కొన్ని ముఖ్యమైన విధులను పాలకులు సక్రమంగా నిర్వర్తించగలిగితే ప్రజలకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది?
ఎన్నికల్లో గెలిచిన వెంటనే అధికారాన్ని చేపట్టిన పార్టీ ప్రతిపక్షాలను కలుపుకొని ముందుకు వెళ్లేందుకు సిద్ధపడాలి. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అసలైన మార్గం అదే. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా తమవంతు పాత్రను నిర్వర్తించాలి. అంటే పాలకుల తప్పులను ఎత్తిచూపడంతో పాటు ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి.
ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో తిమ్మిని బమ్మిగా, బమ్మిని తిమ్మిగా మార్చేవారు రంగంలోకి దిగుతున్నారు. అధికారపక్షం వారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే పదిమంది మంత్రులకు బదులు ఎనిమిది మంది మాత్రమే ప్రమాణం చేస్తున్నారనే విషయాన్ని పట్టుకుని, మిగతా ఇద్దరు విభేదిస్తున్నట్లుగా ప్రచారం చేయడం ఇందుకు ఉదాహరణగా మారుతోంది.
నిరుద్యోగ సమస్యపై వెనకడుగు వేయకూడదు
పోర్ట్‌ఫోలియోల విషయంలో గొడవలు వచ్చాయా? వద్దన్నవారు కూడా మంత్రులయ్యారా? వంటి ఊహాగానాలతో మొదటి రోజు నుంచే సోషల్ మీడియాను పుల్లల మీటియాగా మార్చడం ఎంత దురదృష్టకరం! అయితే ఇలాంటి ప్రచారాల కారణంగా అధికార పార్టీ వెనకడుగు వేయకూడదు.
సాధ్యమైనంతవరకు తాము నెరవేర్చదలచుకున్న ఎన్నికల ఎజెండాను ప్రజల ముందూ, ప్రతిపక్షాల ముందూ ఉంచాలి. ఏ విధంగా పాలన సాగించబోతున్నారో అధికారికంగా ప్రకటించడంలో తప్పులేదు. అది ప్రతిపక్షాలకు తలొగ్గినట్లు కాదు. సామరస్య ధోరణిలో పాలన ప్రణాళికలను వెల్లడిస్తూ, నిర్దిష్ట కాలపరిమితిలో వాటిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రభుత్వం చెప్పవచ్చు.
ఎన్నికల ఎజెండా ఒక్కరోజులో పూర్తయ్యేది కాదు. రాజ్యాంగం ప్రభుత్వం పనిచేసేందుకు ఐదేళ్ల కాలాన్ని నిర్ణయించినప్పుడు, రెండ్రోజుల్లో ఇది కాలేదు, పదిరోజుల్లో ఆ పని చేయలేదు అంటూ గద్దెనెక్కిన 20 రోజులకే దిగిపోవాలంటూ ధర్నాలు చేయడం ప్రజాస్వామ్య ప్రక్రియను బలపరచదు.
అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా గతంలో ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పరిణామాలను తిరగతోడి తప్పులు ఎంచడాన్నే ఐదేళ్ల కార్యక్రమంగా పెట్టుకుంటే ప్రజా సమస్యలు పక్కకు వెళ్లే ప్రమాదం ఉంటుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకు ఇలాంటి రాజకీయ తంతు కొనసాగడం సరికాదు.
విద్యార్థి ఉద్యమాలను తప్పుపట్టడం భావ్యం కాదు
విద్యార్థుల్లో కూడా విభిన్న వర్గాలు ఉంటాయి. బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశించేవారు ఒకవైపు ఉంటే, కాలక్షేపానికి విద్యార్థులుగా మారినవారు, డిగ్రీల కోసం కళాశాలలను ఆశ్రయించేవారు మరోవైపు ఉంటారు.
కొంతమంది విద్యార్థులు రాజకీయ నాయకులకు, వివిధ సంఘాలకు అనుకూలంగా ఉండేందుకు సిద్ధంగా ఉంటారు. ఏ ఉద్యమం వచ్చినా విద్యార్థులను ముందుకు తీసుకురావడం దాదాపు అన్ని దేశాల్లో కనిపించే దృశ్యమే. ఈ నేపథ్యంలో విద్యార్థులు పాలన సరిగా లేదని, చదువులు సక్రమంగా లేవని, ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉందని, చదువులు పూర్తయినా ఉద్యోగాలు రావడం లేదని ఆందోళనలకు దిగుతుంటారు.
‘స్టూడెంట్ స్ట్రయిక్’ ద్వారా ఫలితం త్వరగా లభిస్తుందని భావించే పరిస్థితులు ఉన్నాయి. నిరుద్యోగులు కూడా ఆ ఆందోళనలను మరింత పెంచుతారు. రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఉండేలా వాటిని ప్రోత్సహిస్తాయనే విమర్శలు కూడా ఉన్నాయి.
అయితే ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాలను తప్పుపట్టడం భావ్యం కాదు. అదే సమయంలో నిర్మాణాత్మకంగా, విలువలతో కూడిన విజయాలను విద్యార్థి ఉద్యమాలు చాలా తక్కువగా సాధించగలిగాయని చరిత్ర చెబుతున్నదనే అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
నేపాల్, బంగ్లాదేశ్‌లలో జరిగిన కొన్ని ఉద్యమాలు రాజకీయాలతో ముడిపడి ప్రారంభమైనట్లు కనిపించాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘క్రాకోచ్’ ఉద్యమం మాత్రం ‘నీట్’ పరీక్షల అవకతవకలను ఆధారంగా చేసుకుని ఒక నిర్దిష్టమైన అంశంపై సమగ్ర స్వరూపాన్ని ఏర్పరుచుకుని ఢిల్లీ వీధుల్లోకి వచ్చింది.
ప్రతిదీ బూతద్దంలో చూపడం సరికాదు
స్వచ్ఛందంగా, అనూహ్యంగా ఉద్భవించే ఉద్యమాల స్వరూపం, స్వభావాన్ని పాలకులు గానీ, నిఘా వ్యవస్థలు గానీ ముందుగానే అంచనా వేయలేని పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ఇలాంటి ఉద్యమాలను అసాంఘిక శక్తులు లేదా విదేశీ శక్తులు నడుపుతున్నాయనే వాదనలకు ఆధారాలు లేకుండా ముద్ర వేయడం సరికాదు.
ప్రారంభంలో పరిశుద్ధంగా పుట్టిన నీటి కాలువలోకి పిల్లకాలువల ద్వారా మురికి, మాలిన్యాలు చేరినప్పుడు దాని స్వరూపం మారుతుంది. అలాగే కొన్ని ఉద్యమాలు ప్రారంభమైన తర్వాత వాటిలోకి వివిధ ప్రయోజనాలు, రాజకీయ అంశాలు చేరే పరిస్థితులు కనిపిస్తాయి.
కొన్ని ఉద్యమాల తీరుతెన్నులు ప్రారంభ దశలోనే రాజకీయ రంగును పులుముకున్నట్లు స్పష్టంగా కనిపిస్తాయి. అందువల్ల ఉద్యమాల్లోని అసలు సమస్యలను గుర్తించి, వాటి పట్ల స్పష్టమైన అవగాహనతో వ్యవహరించడం ప్రభుత్వాలకు అవసరం.
అదే సమయంలో కేవలం విద్యార్థుల్లోనే కాకుండా ప్రజల్లో కూడా ఒకరకమైన నిస్సహాయత పెరుగుతున్నదనే భావన ఉంది. ఎవరు ప్రభుత్వంలో ఉన్నా చిన్నచిన్న పనులు కూడా జరగడం లేదనే విమర్శలు గ్రామీణ ప్రాంతాల్లో వినిపిస్తున్నప్పటికీ, వాటిని పూర్తిగా నిర్ధారించడం కష్టం. అందుకే ప్రతి విషయాన్ని బూతద్దంలో చూపడం ప్రజలకు, ప్రభుత్వాలకు, ప్రతిపక్షాలకు మంచిది కాదు.
నిరుద్యోగ సమస్య దేశంలో పెను సవాలు
తిరుగుబాటుకు ఆలంబనగా మారిన నక్సల్ ఉద్యమాలు ప్రస్తుతం అవశేషాలుగా మారాయని కొందరు అంటున్నారు. ఎక్కువ మంది మావోయిస్టులు ప్రభుత్వాలకు లొంగిపోతుండటంతో ఇలాంటి ఆలోచన ప్రభుత్వాలను నడిపేవారికి వచ్చి ఉండవచ్చు.
2014లో బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని ప్రభుత్వం చాకచక్యంగా ఎదుర్కోవడంతో అది చాలావరకు తగ్గిన దాఖలాలు ఉన్నాయని రచన పేర్కొంటోంది. నక్సలిజం కూడా అనేక కారణాల వల్ల కనుమరుగవుతున్నదని, కశ్మీర్‌లో తీవ్రవాదుల సంఘటనలు తగ్గుతున్నాయని పేర్కొంటోంది.
వీటన్నింటినీ అదుపులో ఉంచడం ఒక అంశం అయితే, ప్రస్తుతం నిరుద్యోగ సమస్య దేశంలో పెను సవాలుగా విద్యాధికులను, నిరుద్యోగ బాధితులను వెంటాడుతోంది. అందుచేత ‘క్రాకోచ్ జనతా పార్టీ’ లాంటి వాటికి భవిష్యత్తులో మరింతగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉద్యోగాలను అందుబాటులో ఉంచడం ఒక సమస్య కాగా, నిరుద్యోగుల పేరుతో కృత్రిమ ఉద్యమాలు తెరపైకి వచ్చి శాంతిభద్రతలకు విఘాతం కలిగించే దిశగా పయనిస్తే ప్రభుత్వాలకు ఉన్న ఇతర సమస్యలకు మరో సమస్య తోడవుతుంది.
అందుకే ముందస్తు జాగ్రత్త చర్యలు అవసరం. విద్యార్థులు, నిరుద్యోగులు వీధుల్లోకి రాకుండా ప్రభుత్వం వారిని తృప్తిపరిచే చర్యలు చేపట్టాలి. అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా జాతి ప్రయోజనాల కోసం అందరినీ వెనక్కి నెట్టే విధంగా కాకుండా, ప్రజా సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మకంగా వ్యవహరించడం మంచిది.
