
D News: స్టార్ హీరోల వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం సాధారణమే. కానీ నటుడు ఆర్. మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ మాత్రం అందుకు భిన్నంగా స్విమ్మింగ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇప్పటికే పలు అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు సాధించిన వేదాంత్.. ఇప్పుడు ఏషియన్ గేమ్స్ 2026లో భారత్ తరఫున బరిలోకి దిగుతున్నాడు.
వేదాంత్ స్విమ్మింగ్‌కు సిద్ధమవుతున్న ఫొటోను మాధవన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. మలేషియన్ ఓపెన్‌లో ఐదు స్వర్ణ పతకాలు సాధించిన వేదాంత్.. డానిష్ ఓపెన్‌లోనూ స్వర్ణం, రజతం గెలుచుకున్నాడు. లాత్వియా, థాయ్‌లాండ్ ఓపెన్లలోనూ పతకాలు సాధించాడు.
తండ్రి స్టార్‌డమ్‌ను ఉపయోగించుకోకుండా క్రీడాకారుడిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడమే వేదాంత్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. కొడుకు ఎంచుకున్న క్రీడా ప్రయాణంపై మాధవన్ కూడా పలుమార్లు గర్వం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌లో భారత్ తరఫున వేదాంత్ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
