తెలంగాణలో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బుధవారం భద్రాచలంలో పర్యటించిన ఆయన బీజేపీ నేతలు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల అనంతరం బీజేపీ అధిష్ఠానం తదుపరి లక్ష్యం తెలంగాణేనని బండి సంజయ్ తెలిపారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి ఢిల్లీకి మూటలు పంపుతున్నారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం సహకారంతో అందుతున్న ఇళ్లు సన్నబియ్యం పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఘనతగా చెప్పుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోరాడారని గుర్తుచేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలకే పరిమితమైందని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని బండి సంజయ్ అన్నారు. కార్యకర్తలు పోలీసు కేసులకు భయపడవద్దని సూచించారు. తనపై 109 కేసులు ఉన్నప్పటికీ వెనుకడుగు వేయబోనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని గడపగడపకు వెళ్లి బీజేపీ కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలను వివరించాలని పిలుపునిచ్చారు.

By Rajini