టీమిండియా క్రికెటర్ రింకు సింగ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ వివాహానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. ఇరు కుటుంబాల అంగీకారంతో 2026 డిసెంబర్ 4న లక్నోలోని రమాడా హోటల్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి. తేదీ, వేదిక ఖరారు కావడంతో కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.

2025లోనే ఎంగేజ్‌మెంట్

రింకు సింగ్, ప్రియా సరోజ్‌ల నిశ్చితార్థం 2025 జూన్ 8న లక్నోలోని ది సెంట్రమ్ హోటల్‌లో జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను ప్రైవేట్‌గా నిర్వహించారు. అప్పటి నుంచి వీరి పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే ఆసక్తి అభిమానుల్లో కొనసాగుతోంది.

తాజా సమాచారం ప్రకారం డిసెంబర్ 4న వివాహ వేడుక నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, బంధువులతో పాటు క్రికెట్, రాజకీయ రంగాలకు చెందిన కొందరు ప్రముఖులు కూడా ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

ఎవరీ ప్రియా సరోజ్?

ప్రియా సరోజ్ ఉత్తరప్రదేశ్‌లోని మచ్లీషహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ కూడా సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నాయకుడే. ప్రస్తుతం ఆయన కేరాకత్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు.

టీ20ల్లో రింకు సింగ్ ప్రత్యేక గుర్తింపు

మరోవైపు రింకు సింగ్ టీ20 క్రికెట్‌లో తన పవర్ హిట్టింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ఒకే ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు బాదిన ఇన్నింగ్స్ అతడిని క్రికెట్ అభిమానులకు మరింత చేరువ చేసింది.

ఎంగేజ్‌మెంట్ తర్వాత వీరి వివాహంపై చాలా కాలంగా చర్చ జరుగుతుండగా.. తాజాగా తేదీ, వేదిక ఖరారైనట్లు వార్తలు రావడంతో ఆ ఆసక్తికి తెరపడినట్లైంది.