
అఫ్గానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం సాధించడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు. 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 14.5 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన సంజు 22 బంతుల్లోనే 57 పరుగులు చేసి జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ శర్మతో కలిసి తొలి వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో సంజు తిరిగి ఫామ్‌లోకి రావడంతో పాటు, 2026 ఏషియన్ గేమ్స్‌లో ఓపెనింగ్ స్థానంపై కూడా చర్చ మొదలైంది. ఇదే సమయంలో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కూడా ఓపెనింగ్ రేసులో ఉన్నాడంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
వైభవ్, అభిషేక్ నాకు ప్రత్యర్థులు కాదు
వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మతో తనకు పోటీ ఉందన్న చర్చపై సంజు శాంసన్ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోటీ అనేది బయటివారు సృష్టించే భావన మాత్రమేనని చెప్పాడు.
“వైభవ్, అభిషేక్ నాకు పోటీదారులుగా కనిపించరు. మేమంతా ఒకే జట్టులో ఉన్నాం. దేశం కోసం కలిసి ఆడుతున్నాం. మా ముందున్న లక్ష్యం జట్టు గెలవడమే. ఎవరికైనా అవకాశం రాకపోతే.. నాకు ఎందుకు ఇవ్వలేదు, అతడికి ఎందుకు ఇచ్చారు అనే ఆలోచనలు జట్టులో ఉపయోగపడవు” అని సంజు పేర్కొన్నాడు.
మాజీ క్రికెటర్ల కామెంట్స్‌పై ఫన్నీ రియాక్షన్
తనపై, వైభవ్‌పై మాజీ క్రికెటర్లు చేస్తున్న వ్యాఖ్యల గురించి కూడా సంజు సరదాగా స్పందించాడు. సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లను సాధారణంగా పట్టించుకోనని చెప్పిన అతడు.. అప్పుడప్పుడు మాజీ ఆటగాళ్ల వ్యాఖ్యలు తన దృష్టిలో పడుతుంటాయని అన్నాడు.
“నేను వైఫైని ఆఫ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. కానీ కొన్నిసార్లు అది మళ్లీ ఆన్ అవుతుంది. అప్పుడు మాజీ క్రికెటర్ల కామెంట్లు కనిపిస్తాయి. సీనియర్ ప్లేయర్లు ఏదో ఒకటి చెబుతుంటారు. అది సహజమే” అంటూ నవ్వుతూ చెప్పాడు.
సోషల్ మీడియా ప్రభావం తప్పదు
సోషల్ మీడియా ప్రభావం ఆటగాళ్లపై ఉంటుందని సంజు అంగీకరించాడు. గతంలో తనపై వచ్చిన కామెంట్లు కూడా తనను ప్రభావితం చేశాయని, అయితే అనుభవంతో వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నానని తెలిపాడు.
“మేము మెషీన్లు కాదు.. రోబోలమూ కాదు. సోషల్ మీడియా అసలు ప్రభావం చూపదని చెప్పడం నిజం కాదు. ప్రభావం ఉంటుంది. కానీ దానిపై ఎక్కువగా ఆలోచిస్తే ఆటపై దృష్టి పెట్టలేం. నేను షాట్ ఆడే ముందు ఔటైతే మళ్లీ విమర్శలు వస్తాయని ఆలోచిస్తే నా ఆటను సరిగ్గా ఆడలేను. అందుకే వాటిని పక్కన పెట్టి నా ఆటపై దృష్టి పెడతాను” అని సంజు వివరించాడు.
వైభవ్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా?
అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. చివరి మ్యాచ్‌లో జట్టు కూర్పులో మార్పులు చేసే అవకాశం ఉందన్న సంకేతాలు రావడంతో వైభవ్ సూర్యవంశీకి అవకాశం లభిస్తుందా? అనే ఆసక్తి నెలకొంది.
అయితే ఓపెనింగ్ స్థానంపై ఎవరు ఎవరికి పోటీ అనే దానికంటే.. జట్టు కోసం అందరూ కలిసి పనిచేయడమే ముఖ్యమన్న సంజు వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
