
వెయ్యి రోజులుగా తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తమపై దాడులకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మాజీ సీఎం కేసీఆర్ ఇంటిపై దాడి చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ కేసీఆర్ ఇంటిపై జరిగిన దాడిని అడ్డుకోవాలని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తమపైనా దాడికి ప్రయత్నించారని ఆరోపించారు. సోమవారం సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో తన పీఆర్వో, పీఏలపై సుమారు 15 మందితో దాడి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించిందని విమర్శించారు.
పోలీస్ స్టేషన్‌లో దాడికి ప్రయత్నించిన వారు గుండాలా? పోలీసులా? అని కేటీఆర్ ప్రశ్నించారు. మఫ్టీలో వచ్చి దాడి చేసిన వ్యక్తులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. తమ సిబ్బందిపై జరిగిన దాడికి సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరినా పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
తెలంగాణలో పోలీస్ శాఖ కాంగ్రెస్ కార్యకర్తల కంటే ఎక్కువగా పనిచేస్తోందని కేటీఆర్ విమర్శించారు. పోలీస్ స్టేషన్‌లో దాడులకు పాల్పడిన వారికి మద్దతు ఇచ్చిన వారిపై కూడా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు దాడికి పాల్పడిన వారిపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు.
ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేని పరిస్థితి తెలంగాణలో నెలకొందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరాశ, నిస్పృహల్లో ఉందని కేటీఆర్ విమర్శించారు. అందుకే ప్రతిరోజూ ప్రజల దృష్టిని మళ్లించేందుకు అటెన్షన్ డైవర్షన్‌కు పాల్పడుతోందని ఆరోపించారు.
