ఆగా ఖాన్ ఫౌండేషన్‌పై తనకు అత్యంత గౌరవం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని వారసత్వ సంపద పరిరక్షణ, పునరుద్ధరణలో ఫౌండేషన్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు.

మంగళవారం హైదరాబాద్‌లోని తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి, వారసత్వ పరిరక్షణ కార్యక్రమాలపై చర్చించారు.

తెలంగాణ వారసత్వ కట్టడాల పునరుద్ధరణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ అందిస్తున్న సహకారాన్ని సీఎం ప్రస్తావించారు. ఫౌండేషన్ సహకారంతో ఇటీవల శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించామని తెలిపారు. అలాగే కుతుబ్ షాహీ టూంబ్స్ పునరుద్ధరణలోనూ ఫౌండేషన్ కీలకంగా వ్యవహరించిందని పేర్కొన్నారు.

మూసీ నది పునరుజ్జీవం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలోని సిటీ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రి భవనాల పునరుద్ధరణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ సహకారాన్ని కోరుతున్నట్లు చెప్పారు.

ఉస్మానియా ఆసుపత్రి కోసం గోషామహల్‌లో కొత్త భవనాన్ని నిర్మిస్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని వారసత్వ కట్టడంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. మూసీ నదిని నైట్ ఎకానమీకి అనుగుణంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు తప్పకుండా హాజరు కావాలని ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. 100కు పైగా దేశాల ప్రతినిధులు ఈ సమ్మిట్‌కు హాజరుకానున్నారని తెలిపారు.

2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రేవంత్ రెడ్డి చెప్పారు. సుమారు 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, దీనిని నెట్-జీరో సిటీగా తీర్చిదిద్దనున్నామని తెలిపారు.

ఫ్యూచర్ సిటీ విమానాశ్రయానికి 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. సింగపూర్‌కు చెందిన ఓ సంస్థ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను రూపొందిస్తోందని చెప్పారు. ఇందులో 15 వేల ఎకరాల్లో గ్రీన్ జోన్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే తమ కార్యకలాపాలను ప్రారంభించాయని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

By Rajini