
D Educt: Sept 12: విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం కింద భారీగా నిధులను విడుదల చేసింది. సెప్టెంబరు 11న రూ.179.90 కోట్లను విడుదల చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఈ నిధులను విడుదల చేసినట్లు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు. విదేశాల్లో చదువుకుంటున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మొత్తం 3,008 మంది విద్యార్థులకు ఉపకార వేతనాల చెల్లింపులు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
ఎస్సీ వర్గానికి చెందిన 1,193 మంది విద్యార్థులకు అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద రూ.48.42 కోట్లు విడుదల చేశారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఎస్సీ విద్యార్థులకు ఈ నిధులు అందనున్నాయి.
ఎస్టీ వర్గానికి చెందిన 573 మంది విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద రూ.36.95 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే బీసీ వర్గానికి చెందిన 179 మంది విద్యార్థులకు మహాత్మా జ్యోతిబా ఫులె ఓవర్సీస్ విద్యానిధి కింద రూ.18.41 కోట్లు కేటాయించారు.
మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన 1,063 మంది విద్యార్థులకు సీఎం ఓవర్సీస్ విద్యానిధి కింద రూ.76.13 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా వివరించారు.
మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 3,008 మంది విద్యార్థులకు రూ.179.90 కోట్ల మేరకు స్కాలర్షిప్ నిధుల చెల్లింపులు పూర్తయ్యాయి. విదేశాల్లో ఉన్నత విద్యను కొనసాగిస్తున్న తెలంగాణ విద్యార్థులకు ఈ నిధుల విడుదల ఆర్థికంగా ఎంతో ఉపయోగపడనుంది.
