అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై దాడి జరిగిందని ఆరోపిస్తూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుడికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటన దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఉందని సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. ఈ ఘటన కౌరవసభను తలపించిందని విమర్శించారు. మహిళా ఎమ్మెల్యేల జుట్టుపట్టుకుని లాగారని, పురుష ఎమ్మెల్యేలను కిందపడేసి తొక్కేశారని అన్నారు. పోలీసులతో జరిగిన తోపులాటలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కిందపడిపోయారని తెలిపారు.

30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తమను అసెంబ్లీలోకి ఎందుకు అనుమతించలేదని సబిత ప్రశ్నించారు. కనీసం మహిళా ఎమ్మెల్యేలనైనా లోపలికి అనుమతించాలని కోరినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. తమపై దాడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఆదేశాలు ఇచ్చారని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో తమపై జరిగిన దాడిపై చర్చ జరుగుతుందని ఆశించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి, డీజీపీ ఈ ఘటనపై స్పందిస్తారని భావించామని చెప్పారు. అయితే ఎవరూ దీనిపై మాట్లాడలేదని విమర్శించారు. తమపై దాడి చేసి, తిరిగి తమపైనే కేసులు నమోదు చేశారని ఆరోపించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఫిర్యాదులు చేయించారని, తమ ఎమ్మెల్సీ స్పీకర్‌ను ఏదో అన్నారంటూ కేసులు పెట్టారని సబిత అన్నారు. కేసీఆర్ ఇంటి వద్ద చావుడప్పు కొట్టేందుకు వ్యక్తులను పంపించడం కూడా ముఖ్యమంత్రి ఆదేశాలతోనే జరిగిందని ఆరోపించారు.

మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి సంబంధించి కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని సబిత ఆరోపించారు. తమకు జరిగిన అవమానాన్ని అసెంబ్లీలో ప్రస్తావించేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని అన్నారు. అసెంబ్లీలో తమకు న్యాయం జరగకపోవడంతోనే ఢిల్లీకి వచ్చి జాతీయ కమిషన్లను ఆశ్రయించామని తెలిపారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పిందని అయితే ఇప్పటివరకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని సబిత విమర్శించారు. 22ఏ కింద కోటి ఎకరాలను నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాకు పాల్పడుతోందని ఆరోపించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై అసెంబ్లీ సాక్షిగా దాడులు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మహిళా కానిస్టేబుళ్లను ముందుపెట్టి శిఖండి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించాలని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామని, వారికి లేఖలు కూడా రాస్తామని తెలిపారు.

By Rajini