
D Educt: Sept 11: ఎస్సీ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం, వారు నివసించే కాలనీల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మొత్తం రూ.226 కోట్లు ఖర్చు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ఇందులో పీఎం అజయ్ పథకం కింద గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా రూ.100 కోట్లు విడుదల చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని ఈ నిధులు ఈ నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
పీఎం అజయ్ పథకం కింద ఈ ఏడాది రాష్ట్రానికి కేంద్రం రూ.36 కోట్ల వరకు మాత్రమే కేటాయించింది. అయితే ఎస్సీ యువతకు మరింత ప్రయోజనం చేకూర్చాలనే ఉద్దేశంతో అధిక మొత్తంలో నిధులు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా రూ.100 కోట్లకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది. ఈ పథకం కింద చేపట్టే కార్యక్రమాల్లో ఆదాయ ఉత్పాదకత, అంటే స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం 56 అంశాలను గుర్తించగా, వాటిలో 38 స్వయం ఉపాధి, ఆదాయాన్ని పెంచే కార్యక్రమాలకు సంబంధించినవే. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 18,200 మందికి ప్రయోజనం చేకూరనుంది.
ఆదాయ ఉత్పాదకత కార్యక్రమాల కింద 11,200 మందికి రాయితీతో కూడిన రుణాలు మంజూరు చేయనున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఆహార శుద్ధి, పరిశ్రమలు, సేవారంగం, హెర్బల్, హెల్త్‌కేర్, ఐటీ, డిజిటల్, సాంకేతిక సేవలు, హస్తకళలు, ఆటోమొబైల్ సర్వీసెస్ వంటి వివిధ రంగాల్లో స్వయం ఉపాధి కల్పించేందుకు 38 రకాల యూనిట్లను ప్రతిపాదించారు. వీటిలో డ్రోన్ సర్వీసులు, సుగంధ ద్రవ్యాల ప్రాసెసింగ్, హెర్బల్ ఉత్పత్తుల తయారీ, ఎల్ఈడీ సైన్‌బోర్డులు, ఫ్లెక్సీ ప్రింటింగ్, కస్టమైజ్డ్ ప్రింటింగ్-లేబులింగ్, డిజిటల్ ఎంబ్రాయిడరీ, ఇమిటేషన్ జ్యువెలరీ, బొమ్మల తయారీ, కొబ్బరిపీచు ఆధారిత హస్తకళలు, గేమింగ్ జోన్లు, ఫోర్ వీలర్ వీల్ బ్యాలెన్సింగ్ సర్వీసులు, ఈ-ఆటోల వంటి యూనిట్లు ఉన్నాయి.
ఈ యూనిట్ల ఏర్పాటుకు సెర్ప్ ఉన్నతి పథకం కింద రూ.50 వేల వరకు రాయితీ అందించనున్నారు. అదనంగా అవసరమైన లబ్ధిదారులకు బ్యాంకులు, ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీల ద్వారా రుణ సదుపాయం కల్పించనున్నారు. తద్వారా ఎస్సీ యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు స్థిరమైన ఆదాయ వనరులు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది.
