
D News: మలయాళంలో తన సహజమైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ అనస్వర రాజన్ ఇప్పుడు టాలీవుడ్‌లోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో తన మార్క్ చూపిస్తోంది. క్యూట్ లుక్స్‌తో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది.
అనస్వర రాజన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి మేకర్స్ ప్రత్యేక పోస్టర్లను విడుదల చేసి విషెస్ తెలిపారు.అందులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం ‘కాకా’ పోస్టర్ ప్రత్యేకంగా ఆకట్టుకుంది. బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్నారు.
‘కాకా’లో అనస్వర.. చిరంజీవి కూతురి పాత్రలో కనిపించనుంది. బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఆమె మెడికల్ స్టూడెంట్‌గా కనిపించింది. చేతిలో పుస్తకాలు, డాక్టర్ కోట్‌తో ఉన్న అనస్వర లుక్‌కు వెనుక చిరంజీవి షాడోను చూపించడం ఆసక్తిని పెంచింది. సినిమాలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.
ఇక అనస్వర నటిస్తున్న మరో చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు మహేష్ ఉప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. వెంకీ కుడుముల సమర్పణలో వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో అనస్వర ‘కీర్తి’ అనే విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో ఎర్రటి ఓణిలో ఆమె లుక్ ఆకట్టుకుంటోంది.
అదే సమయంలో ‘అంతా రాములోరు చూసుకుంటారు’ అనే ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీలోనూ అనస్వర హీరోయిన్‌గా నటిస్తోంది. ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్, VGB ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అనస్వర ‘శిరీష’ పాత్రలో కనిపించనుంది.
ఇలా ఒకేసారి మూడు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో టాలీవుడ్‌లో అనస్వర రాజన్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. ముఖ్యంగా ‘కాకా’ లాంటి భారీ సినిమాలో చిరంజీవి కూతురిగా కనిపించనుండటం ఆమె కెరీర్‌కు మంచి ప్లస్‌గా మారే అవకాశం ఉంది. ఈ సినిమాలు విడుదలైన తర్వాత తెలుగులో అనస్వరకు మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.
