గుజరాత్‌లోని వడోదరలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఈ సందర్భంగా రూ.35 వేల కోట్లకు పైగా విలువైన మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, జాతికి అంకిత కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేశారు.
ఈ పర్యటనలో ప్రధాన ఆకర్షణగా వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డబ్ల్యూఎఫ్‌డీసీ)లోని మూడు కీలక సెక్షన్లను ప్రధాని జాతికి అంకితం చేశారు. సుమారు 326 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ మార్గాన్ని రూ.20,700 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించారు. ఈ మూడు సెక్షన్ల ప్రారంభంతో ప్రత్యేక సరకు రవాణా మార్గం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.
అలాగే రైల్వే రవాణా సామర్థ్యాన్ని పెంచే పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేశారు. ఇందులో వడోదర–రత్లాం మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణం కూడా ఉంది. అదనంగా ఎన్‌హెచ్-48, ఎన్‌హెచ్-53లను అప్‌గ్రేడ్ చేసే కీలక జాతీయ రహదారి ప్రాజెక్టులకు కూడా శ్రీకారం చుట్టారు. గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను సైతం ప్రారంభించారు.
వడోదర అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ రింగ్ రోడ్ ఫేజ్-2, ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద నిర్మించనున్న కొత్త గృహాలు, కదానా డ్యామ్ వద్ద 110 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టు ఇందులో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులతో రైల్వే, రహదారులు, సరకు రవాణా, గృహ నిర్మాణం, పునరుత్పాదక ఇంధన రంగాల్లో మౌలిక వసతులు మరింత బలోపేతం కానున్నాయి.
