
హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ సమీపంలో సోమవారం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు వరుసగా కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును అరెస్ట్ చేసేందుకు పోలీసులు భారీగా ఆయన నివాసానికి చేరుకున్నారు.
తాతా మధు ఇంటి నుంచి బయటకు రావాలని పోలీసులు కోరడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో తాతా మధుపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.
తాతా మధును అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చనున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు నవీన్‌కుమార్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. మరోవైపు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు సుధీర్రెడ్డిపైనా కేసులు నమోదు చేశారు.
పోలీసులతో అనుచితంగా ప్రవర్తించడం వాగ్వాదానికి దిగడం వంటి అంశాలపై సైఫాబాద్ పోలీసులు వీడియో ఫుటేజీ ఆధారంగా కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి మొత్తం మూడు కేసులు నమోదయ్యాయి. వీడియో ఫుటేజీ ఆధారంగా మరికొందరి పాత్రపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
