
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ వర్షసూచన జారీ చేసింది. ఏపీ, తెలంగాణలో రానున్న రోజుల్లో పలు ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. వర్షాల సమయంలో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
తెలంగాణలో సెప్టెంబర్ 3న ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో వాతావరణంలో తేమ శాతం అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో చల్లటి వాతావరణం నెలకొని, అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముంది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 23 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు కూడా వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సెప్టెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
ప్రస్తుతం ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఎత్తుకు వెళ్లేకొద్దీ ఇది నైరుతి దిశగా వంగి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఈ వ్యవస్థ పశ్చిమ-వాయువ్య దిశగా దక్షిణ ఉత్తరప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్ మీదుగా కదిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు, మధ్యప్రదేశ్ నుంచి తూర్పు-మధ్య బంగాళాఖాతం వరకు రుతుపవన ద్రోణి విస్తరించి ఉంది. తీవ్ర అల్పపీడనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ స్పష్టం చేసింది.
