
D Educt: Sept 3: విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో.. ఆధార్, అపార్ వివరాల నమోదు
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా హైదరాబాద్ జిల్లా యంత్రాంగం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి ఆధార్, అపార్ కార్డు వివరాలను పాఠశాల రికార్డుల్లో నమోదు చేస్తున్నారు.
ఆధార్ ద్వారా విద్యార్థి గుర్తింపును, అపార్ కార్డు ద్వారా విద్యార్థి వ్యక్తిగత వివరాలు, మార్కులు, ప్రతిభా పురస్కారాలు వంటి విద్యా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖ అధికారులు ఈ వివరాలను సులభంగా పరిశీలించవచ్చు. ఈ సమాచారం ఆధారంగా విద్యార్థులకు మరిన్ని సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త పాఠశాలల ఏర్పాటుపై కూడా ప్రభుత్వానికి అవగాహన కలగనుంది.
మూడు విధానాల్లో విద్యార్థుల వివరాల నమోదు
విద్యార్థుల వివరాలను కచ్చితంగా నమోదు చేసేందుకు మూడు విధానాలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హాజరు పట్టీలోని వివరాలను కంప్యూటరీకరించేందుకు తొలి విధానం ఉపయోగపడుతుంది. ప్రతి విద్యార్థి సమాచారం యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (UDISE)లో నమోదు చేయాలి. ఇందులో విద్యార్థి, తల్లిదండ్రుల పేర్లు సక్రమంగా ఉండేలా చూసుకోవాలి.
పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే ముందు విద్యార్థుల హాల్‌టికెట్ నమూనాను తల్లిదండ్రులు పరిశీలించాలి. అందులో ఏమైనా తప్పులు ఉంటే ముందుగానే సరిచేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
అపార్ కార్డుతో విద్యా వివరాలు
ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (APAAR) దేశవ్యాప్తంగా ప్రతి విద్యార్థికి అందిస్తున్న ప్రత్యేక గుర్తింపు కార్డు. అపార్ వివరాలను కంప్యూటరీకరించిన తర్వాత విద్యార్థి ఒకటో తరగతి నుంచి డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ వంటి ఉన్నత విద్య వరకు ఎక్కడ చదివినా, అపార్ నంబర్‌ను ఉపయోగించడం ద్వారా విద్యా వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఆధార్ వివరాల్లోనూ మార్పులు, చేర్పులు
విద్యార్థుల ఆధార్ వివరాలను నమోదు చేసే సమయంలో వేలిముద్రలను కూడా నవీకరించనున్నారు. దీనివల్ల విద్యార్థులు భవిష్యత్తులో డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్యకు వెళ్లినప్పుడు ఆధార్‌లో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవడం మరింత సులభమవుతుంది.
ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల నమోదు
బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లో చేరేలా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల నమోదు ప్రక్రియను జూన్ 15 నుంచి చేపట్టింది. ప్రతి జిల్లాలో మండలాల వారీగా విద్యాశాఖ అధికారులు తమ పరిధిలోని ఇళ్లకు వెళ్లి పాఠశాలకు వెళ్లని పిల్లలను గుర్తించి సమీప పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంటుంది.
ఈ ప్రక్రియను సమర్థంగా నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆదేశించారు. హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 10.29 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వీరిలో ఇప్పటికే 9.36 లక్షల మంది విద్యార్థుల ఆధార్ కార్డు వివరాలను ఆన్లైన్లో నమోదు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. అలాగే అపార్ కార్డులకు సంబంధించి 59 శాతం మంది విద్యార్థుల వివరాలను వెబ్సైట్లో నమోదు చేసినట్లు తెలిపారు.
