
సింగరేణి భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటీకరిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రస్తుతం భూగర్భ గనుల ప్రైవేటీకరణకు ఎలాంటి ప్రతిపాదన లేదని వెల్లడించింది.
సింగరేణి ప్రస్తుతం 21 భూగర్భ, 17 ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తోందని తెలిపింది. నష్టాల్లో కొనసాగుతున్న కొన్ని భూగర్భ గనులను కూడా ఉద్యోగ భద్రత, ఉపాధి పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని కొనసాగిస్తున్నామని పేర్కొంది. వాటిని భవిష్యత్‌లో లాభదాయకంగా మార్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది.
శాంతిఖని గనికి సంబంధించిన ఎండీవో ఈవోఐను ప్రైవేటీకరణలో భాగంగా చేపట్టలేదని యాజమాన్యం స్పష్టం చేసింది. వ్యయాలను తగ్గించే మార్గాలను అధ్యయనం చేసేందుకు చేపట్టిన పైలట్ ప్రయత్నం మాత్రమే అని తెలిపింది. సింగరేణి గనుల ప్రైవేటీకరణపై వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని యాజమాన్యం కోరింది.
ఇటీవల సింగరేణి భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటుపరం చేస్తున్నారంటూ వార్తలు వెలువడ్డాయి. ప్రధాన మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ ప్రచారం విస్తృతంగా సాగింది. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణ అంశంపై సింగరేణి యాజమాన్యం స్పందించింది.
భూగర్భ గనుల ప్రైవేటీకరణకు సంబంధించిన వార్తలను యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం సింగరేణి పరిధిలోని భూగర్భ గనులను ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని స్పష్టం చేసింది. ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పేర్కొంది
బాధ్యతాయుతమైన ప్రభుత్వ రంగ సంస్థగా సింగరేణి బొగ్గు ఉత్పత్తితో పాటు దేశ ఇంధన భద్రతలో కీలక పాత్ర పోషిస్తోందని యాజమాన్యం పేర్కొంది. మైనింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి ప్రస్తుతం 21 భూగర్భ, 17 ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తూ.. దేశ ఇంధన భద్రత, పారిశ్రామిక అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం కొన్ని భూగర్భ గనులు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రాంతంలోని వేలాది మందికి ఉపాధి, ఉద్యోగ భద్రత కల్పించాలనే ఉద్దేశంతో వాటిని కొనసాగిస్తున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. నష్టాలను వీలైనంత వరకు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.
భూగర్భ గనులను మూసివేయడం లేదా ప్రైవేటుపరం చేయడం తమ ఉద్దేశం కాదని సింగరేణి స్పష్టం చేసింది. వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, నిర్వహణ వ్యయాలను తగ్గించడం వంటి చర్యల ద్వారా సాధ్యమైనన్ని గనులను లాభదాయకంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది.
నష్టాల్లో కొనసాగుతున్న శాంతిఖని భూగర్భ గనిలో ఉత్పత్తి కార్యకలాపాలను ఎండీవో విధానంలో నిర్వహిస్తే బొగ్గు ఉత్పత్తి వ్యయాలను తగ్గించడంతో పాటు నష్టాలను నివారించవచ్చా అనే అంశాన్ని పరిశీలించేందుకు సింగరేణి యాజమాన్యం ఓ పైలట్ ప్రాజెక్టును ప్రతిపాదించినట్లు తెలిపింది.
ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి 2న ఈవోఐ ప్రకటన జారీ చేసి ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించినట్లు వెల్లడించింది. తొలుత జనవరి 15 వరకు గడువు ఇచ్చినా ఏ సంస్థా ఆసక్తి చూపలేదని పేర్కొంది. దీంతో గడువును జనవరి 22 వరకు పొడిగించగా.. ఒక్క సంస్థ మాత్రమే ముందుకొచ్చిందని తెలిపింది. అయితే తదుపరి దశలో ఆ సంస్థ కూడా ప్రక్రియలో కొనసాగేందుకు ఆసక్తి చూపలేదని వెల్లడించింది.
ఈ ప్రక్రియకు ఆశించిన స్పందన రాకపోవడంతో ఎండీవో ప్రతిపాదనను విరమించుకున్నట్లు సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. ఇది కేవలం వ్యయాలను తగ్గించడం, గనిని లాభదాయకంగా మార్చే అవకాశాలను అధ్యయనం చేసేందుకు చేపట్టిన పైలట్ ప్రయత్నమేనని తెలిపింది.
శాంతిఖని గనికి సంబంధించిన ఈవోఐ ప్రక్రియను ఇప్పటికే విరమించుకున్నామని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. భూగర్భ గనులను మరింత సమర్థంగా నిర్వహించడంతో పాటు వాటిలో నష్టాలను తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.
సాధ్యమైనన్ని భూగర్భ గనులను లాభదాయకంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని, తద్వారా తెలంగాణ ప్రాంతంలో ఉపాధి అవకాశాలను మరింత పెంచేందుకు అవకాశం ఉంటుందని పేర్కొంది. ఉద్యోగ భద్రత, ఉపాధి పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ సింగరేణి సంస్థ నిరంతరం పనిచేస్తోందని యాజమాన్యం వెల్లడించింది.
