
D Educt: Sept 1: వర్కింగ్ ప్రొఫెషనల్స్‌కు సాయంత్రం బీటెక్ ప్రవేశ పరీక్ష
పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ప్రస్తుతం వివిధ ఉద్యోగాలు చేస్తున్నవారు సాయంత్రం బీటెక్ కోర్సులో చేరేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ప్రవేశ పరీక్షను సెప్టెంబరు 20న నిర్వహించనున్నట్లు ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్, ఈసెట్ (వర్కింగ్ ప్రొఫెషనల్స్) కన్వీనర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు.
ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబరు 7 వరకు గడువు ఉందని తెలిపారు. ఆలస్య రుసుముతో సెప్టెంబరు 12 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని వెల్లడించారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలతో పాటు మొత్తం 14 కళాశాలల్లో సాయంత్రం బీటెక్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నట్లు ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు.
మొత్తం ఏడు రకాల బీటెక్ కోర్సుల్లో సీట్ల భర్తీకి ఇప్పటివరకు 304 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన వెల్లడించారు. ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యను కొనసాగించాలనుకునే డిప్లొమా అభ్యర్థులకు ఈ కోర్సులు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
