విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ అండగా నిలిచారు. వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన ముగ్గురు పోలీసు సిబ్బంది కుటుంబాలకు ఎస్‌బీఐ ఇన్సూరెన్స్‌ పథకం కింద ఒక్కొక్కరికి రూ.కోటి చొప్పున మొత్తం రూ.3 కోట్ల బీమా పరిహారాన్ని అందించారు.

సోమవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మృతుల కుటుంబ సభ్యులకు డీజీపీ బీమా చెక్కులను అందజేశారు. శంకర్‌పల్లి పరిధిలో 2025 ఫిబ్రవరి 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో 2018 బ్యాచ్‌కు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ ముత్తంగి శ్రీనివాస్‌ మృతి చెందారు. ఆయన కుటుంబానికి మంజూరైన రూ.కోటి బీమా చెక్కును శ్రీనివాస్‌ తండ్రి ముత్తంగి యాదయ్యకు డీజీపీ అందించారు.

అదేవిధంగా నల్లగొండ జిల్లా కనగల్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న 2004 బ్యాచ్‌కు చెందిన పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ బోలెపల్లి సైదులు 2025 జూన్‌ 3న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వరంగల్‌కు చెందిన కానిస్టేబుల్‌ కె. వెంకటరెడ్డి కూడా విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మృతి చెందారు. 2026 మార్చి 10న వరంగల్‌ ఏఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఆయన మృతిచెందారు.

మృతులందరికీ ఎస్‌బీఐలో ఇన్సూరెన్స్‌ అకౌంట్లు ఉండటంతో పోలీసుశాఖ అధికారులు బ్యాంకు అధికారులను సంప్రదించారు. దీంతో నిబంధనల మేరకు ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున బీమా పరిహారం మంజూరైంది. ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్‌ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు పోలీసుశాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని డీజీపీ భరోసా ఇచ్చారు. కుటుంబాల సంక్షేమానికి శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్‌బీఐ అధికారులు, పోలీసుశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

By Rajini