
రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం 1,000 రోజులు పూర్తి చేసుకుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఈ వెయ్యి రోజుల పాలనలో విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. రైతులు, మహిళలు, వ్యవసాయ కూలీలు, బలహీనవర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి దాదాపు 25.35 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశామని, ఇందుకోసం రూ.20 వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశామని చెప్పారు. రైతు భరోసా మొత్తాన్ని ఎకరానికి రూ.12 వేలకు పెంచి ఇప్పటివరకు రూ.36 వేల కోట్లు అందించినట్లు వెల్లడించారు.
వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించిందని ఆయన అన్నారు. సన్న వడ్ల బోనస్ కోసం రూ.4 వేల కోట్లు, ఉచిత విద్యుత్ కోసం రూ.30 వేల కోట్లు, రైతు బీమాకు రూ.3,500 కోట్లు కేటాయించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు.
సంక్షేమ పథకాల అమలులోనూ ప్రభుత్వం ముందంజలో ఉందని చెప్పారు. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే ఎల్పీజీ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు. అలాగే 16.32 లక్షల కొత్త రేషన్ కార్డులను జారీ చేసినట్లు పేర్కొన్నారు.
యువతకు ఉపాధి కల్పన, విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. ఇప్పటివరకు 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టామని చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంతో పాటు ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు.
సామాజిక న్యాయం దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన అన్నారు. బీసీ కులగణన చేపట్టి స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించామని, ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు.
ప్రజాపాలన ప్రభుత్వం విజయవంతంగా 1,000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మహేశ్‌కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.
