
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల్లో భూభారతి పోర్టల్ ద్వారా జరిగే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు రెండు వారాలుగా నిలిచిపోయాయి. కార్యాలయాల్లో భూభారతి ఆపరేటర్లు లేకపోవడంతో క్రయవిక్రయాలు బహుమతి వారసత్వ బదిలీ తనఖా రిజిస్ట్రేషన్లు వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చే ప్రక్రియ తదితర సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్లాట్ బుక్ చేసుకున్న దరఖాస్తుదారులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అదే సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయమూ నిలిచిపోయింది.
జిల్లాలోని 18 తహసీల్దార్ కార్యాలయాల్లో భూభారతి పోర్టల్ ద్వారా రోజూ సగటున 4 నుంచి 5 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. మొత్తంగా రోజుకు సుమారు 70 వరకు వివిధ రకాల లావాదేవీలు నమోదయ్యేవి. ఈ సేవలను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో భూభారతి ఆపరేటర్లను నియమించింది. గతంలో ధరణి పేరుతో కొనసాగిన ఈ సేవల్లో దాదాపు ఏడేళ్లుగా వీరే కీలకంగా వ్యవహరించారు.
అయితే ఔట్సోర్సింగ్ ఆపరేటర్లపై అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు రావడంతో వారిని ప్రభుత్వం తొలగించింది. ఈ నెల 8న జిల్లాలోని ఆపరేటర్లను తొలగించగా అంతకుముందే నాలుగైదు రోజుల నుంచి పలు మండలాల్లో భూభారతి సేవలు నిలిచిపోయాయి. ఆపరేటర్ల స్థానంలో ప్రభుత్వ ఉద్యోగులైన జూనియర్ అసిస్టెంట్లకు భూభారతి సేవల బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందులో భాగంగా జిల్లాలోని 18 మండలాల్లో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్లకు భూభారతి సేవలపై సాంకేతిక శిక్షణ కూడా ఇచ్చారు. స్లాట్ బుకింగ్ భూముల వివరాల నమోదు హక్కుల మార్పిడి క్రయవిక్రయాలు వారసత్వ బదిలీ మార్టిగేజ్ తదితర ప్రక్రియలపై వారికి అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగులే ఈ సేవలను నిర్వహించడంతో పొరపాటు లేదా అక్రమం జరిగితే బాధ్యులపై నేరుగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
