
D Educt: Aug 22: ఉన్నత విద్యలో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్ తప్పనిసరి
ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్ను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రిజర్వేషన్ను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా, అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు నిజంగా ప్రయోజనం కల్పించాలని దివ్యాంగుల సాధికారత విభాగం అదనపు కార్యదర్శి మన్మీత్ కౌర్ నందా సూచించారు.
అశోక యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మన్మీత్ కౌర్ నందా ఈ అంశంపై మాట్లాడారు. ఉన్నత విద్యలో దివ్యాంగ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.
ఉన్నత విద్యాసంస్థల్లో దివ్యాంగ విద్యార్థులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించేలా కేంద్ర ప్రభుత్వం 2016లోనే చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే కొన్ని విద్యాసంస్థలు ఈ నిబంధనలను అమలు చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
రిజర్వేషన్ అమలుకు సంబంధించి ఇప్పటికే పలు కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యాసంస్థలు చట్టబద్ధమైన రిజర్వేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
