
D Educt: Aug 22: డీఎస్సీ-1998 అభ్యర్థులకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లుగా అవకాశం ఇవ్వాలి
మినిమం టైం స్కేల్‌తో ఒప్పంద ఉపాధ్యాయులుగా నియామకాలు పూర్తైన తర్వాత మిగిలిపోయిన డీఎస్సీ-1998 అభ్యర్థులకు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లుగా అవకాశం కల్పించాలని డీఎస్సీ-98లో మిగిలిపోయిన అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్ నిబంధనలను పాటించకుండా ఓపెన్ మెరిట్ విధానంలో 3,885 మందికి ఒప్పంద ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు కల్పించారని ఆయన తెలిపారు. దీనివల్ల రిజర్వేషన్ కేటగిరీకి చెందిన పలువురు అభ్యర్థులు నష్టపోయారని పేర్కొన్నారు.
మిగిలిపోయిన అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతూ యువగళం పాదయాత్ర సమయంలో మంత్రి లోకేశ్‌కు వినతిపత్రాలు సమర్పించినట్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అప్పట్లో ఈ అంశంపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలు చేపడుతున్న నేపథ్యంలో, డీఎస్సీ-1998లో ఉద్యోగాలు పొందకుండా మిగిలిపోయిన అభ్యర్థులకు కూడా అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఈ నిర్ణయం ద్వారా ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.
