
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం సాధించాలన్న పీవీ సింధు ఆశలకు బ్రేక్ పడింది. ప్రిక్వార్టర్ఫైనల్లో మూడో సీడ్ వాంగ్ జి యీ చేతిలో సింధు ఓటమి చవిచూసింది. హోరాహోరీగా సాగిన పోరులో 11-21, 21-15, 17-21తో పరాజయం పాలైంది. అయితే మ్యాచ్‌లో వాంగ్ పలుమార్లు గాయం పేరుతో విరామాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ కారణంగా తన ఏకాగ్రత దెబ్బతిందని సింధు పేర్కొంది.
వాంగ్ టైమ్ఔట్లపై చర్చ
మ్యాచ్ మధ్యలో వాంగ్ పలుమార్లు ఆటకు విరామం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో ఆమె పూర్తిగా ఆటకు దూరమయ్యేంతగా ఇబ్బందిపడినట్లు కనిపించకపోయినా.. గాయం కారణంగా అదనపు సమయం తీసుకుంది.
నిబంధనల ప్రకారం ర్యాలీల మధ్య సాధారణంగా 25 సెకన్ల వ్యవధి ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో అంపైర్ నిర్ణయం మేరకు ఈ సమయాన్ని పొడిగించే అవకాశం ఉంటుంది. కోల్డ్ స్ప్రే విషయంలోనూ రెండేళ్ల క్రితమే నిబంధనల్లో మార్పులు చేశారు. మ్యాచ్ లేదా విరామ సమయంలో టోర్నమెంట్ వైద్య సిబ్బంది నేరుగా ప్లేయర్‌కు కోల్డ్ స్ప్రే ఇవ్వకూడదు. ఆటగాడే స్వయంగా ఉపయోగించుకోవాలి లేదా తన సొంత వైద్య సిబ్బంది సహాయం తీసుకోవచ్చు. ఈ క్రమంలో వాంగ్ తీసుకున్న సమయం కూడా చర్చకు దారితీసింది.
మూడో గేమ్‌లో అసలు ట్విస్ట్
తొలి గేమ్‌లో సింధు 11-21తో వెనుకబడింది. అయితే రెండో గేమ్‌లో అద్భుతంగా పుంజుకున్న భారత స్టార్ 21-15తో గెలిచి మ్యాచ్‌ను సమం చేసింది.
నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఒక దశలో సింధు 8-4తో ఆధిక్యంలోకి వెళ్లింది. అదే సమయంలో వాంగ్ కండరాల సమస్యతో ఇబ్బంది పడుతూ విరామం తీసుకుంది. అనంతరం సింధు 13-10తో ముందంజలో ఉన్న సమయంలోనూ వాంగ్ మరోసారి ఆటను నిలిపివేసింది.
ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత వాంగ్ వరుసగా ఐదు పాయింట్లు సాధించి 15-13తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే సింధు మళ్లీ పుంజుకుని 16-15తో ముందంజలోకి వచ్చింది. ఈ దశలో వాంగ్ మెడికల్ టైమ్‌ఔట్ తీసుకోవడం మరోసారి మ్యాచ్‌పై ప్రభావం చూపింది.
స్కోరు 17-18గా ఉన్న సమయంలో ఇద్దరూ ఏకంగా 54 షాట్ల ర్యాలీ ఆడారు. ఆ పాయింట్‌ను వాంగ్ గెలుచుకుంది. అనంతరం కాళ్లలో తిమ్మిరి అంటూ మరోసారి విరామం తీసుకుంది. ఆ తర్వాత వాంగ్ వరుస పాయింట్లు సాధించి 21-17తో మూడో గేమ్‌ను, మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది.
దాదాపు 88 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో వాంగ్ తీసుకున్న విరామాలు మ్యాచ్ గమనాన్ని ప్రభావితం చేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సింధు దూకుడును ఆపేందుకు ఈ విరామాలు ఉపయోగపడ్డాయనే విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరోవైపు, తాను మరింత ఓపికగా ఆడి ఉండాల్సిందని సింధు పేర్కొనడం గమనార్హం.
