
2027 వన్డే ప్రపంచకప్‌కు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉన్నప్పటికీ.. టీమిండియా కూర్పుపై ఇప్పటి నుంచే చర్చలు ఊపందుకున్నాయి. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించనున్న ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు ఎలా ఉండాలనే దానిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు రాబిన్ ఊతప్ప తన అంచనా 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియోలో ఊతప్ప తన ఎంపికలను వెల్లడించారు. ఆయన జట్టులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌ను ఓపెనర్లుగా ఎంపిక చేశారు. వీరితో పాటు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా చోటు కల్పించడం ఆసక్తికరంగా మారింది.
వైభవ్‌కు చోటు..
ఊతప్ప జట్టులో అందరి దృష్టినీ ఆకర్షించిన అంశం వైభవ్ సూర్యవంశీ ఎంపిక. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో తన సత్తా చాటిన వైభవ్.. 2026 సీజన్లో 16 ఇన్నింగ్స్‌లలో 776 పరుగులు సాధించాడు. 48.50 బ్యాటింగ్ సగటుతో పాటు 237.31 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. 2026 జూలై 4న ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత సీనియర్ జట్టులో అరంగేట్రం చేసిన అతడు.. ఇప్పటివరకు వన్డేల్లో మాత్రం ఆడలేదు. 2027 ప్రపంచకప్ నాటికి వైభవ్ మరింత అనుభవం సంపాదించి జట్టుకు కీలకంగా మారగలడనే అంచనాతో ఊతప్ప అతడిని తన జాబితాలో చేర్చారు.
రోహిత్, కోహ్లికి చోటు
మరోవైపు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇద్దరినీ కూడా ఊతప్ప తన జట్టులో కొనసాగించారు. 2027 ప్రపంచకప్ సమయానికి ఈ ఇద్దరు దిగ్గజాలు అంతర్జాతీయ క్రికెట్లో ఉంటారా? అనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. అయితే ఊతప్ప మాత్రం తన అంచనా జట్టులో ఇద్దరికీ స్థానం కల్పించారు.
మిడిలార్డర్లో శ్రేయాస్ అయ్యర్‌కు చోటు ఇచ్చిన ఊతప్ప.. వికెట్ కీపింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో అదనపు అవకాశాల కోసం కేఎల్ రాహుల్, సంజూ శాంసన్‌లను ఎంపిక చేశారు.
ఆల్రౌండర్లుగా వీరే..
ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యాను ప్రధాన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఎంచుకున్నారు. స్పిన్ ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు అవకాశం ఇచ్చారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు.
అయితే శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, నితీశ్ కుమార్ రెడ్డిలకు ఈ 15 మంది జట్టులో చోటు దక్కలేదు.
బౌలింగ్ విభాగంలో..
పేస్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్‌లను ఊతప్ప ఎంపిక చేశారు. వీరితో పాటు అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్‌కు కూడా చోటు కల్పించడం కొంత ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇక యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ఆటగాళ్లు ఊతప్ప ప్రకటించిన 15 మంది జాబితాలో కనిపించలేదు.
రాబిన్ ఊతప్ప ఎంపిక చేసిన 15 మంది జట్టు:
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, వైభవ్ సూర్యవంశీ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్.
