
పారిస్‌లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ అనూహ్యంగా ఓటమిపాలయ్యాడు. అమెరికాకు చెందిన 92వ ర్యాంకర్ గారెట్ టాన్ చేతిలో పరాజయం చవిచూసి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో లక్ష్య సేన్, గారెట్ టాన్ తలపడ్డారు. 73 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌ను లక్ష్య సేన్ 21-19తో గెలిచాడు. అయితే ఆ తర్వాత గారెట్ టాన్ అద్భుతంగా పుంజుకున్నాడు.
రెండో గేమ్‌లో 21-19తో విజయం సాధించిన టాన్.. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ 21-17తో పైచేయి సాధించాడు. దీంతో మ్యాచ్‌ను 19-21, 21-19, 21-17తో గెలుచుకుని ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు.
మ్యాచ్ అనంతరం గారెట్ టాన్ మాట్లాడుతూ.. తాను శుక్రవారం తిరిగి వెళ్లేందుకు రిటర్న్ టికెట్ కూడా బుక్ చేసుకున్నానని, ఇప్పుడు టోర్నీలో తన ప్రయాణం కొనసాగుతుండటం ఆనందంగా ఉందని చెప్పాడు.
ఇదే టాన్‌కు తొలి ప్రపంచ ఛాంపియన్షిప్. లక్ష్య సేన్ వంటి స్టార్ ఆటగాడిపై విజయం సాధించడం అతడి కెరీర్లో కీలక విజయంగా నిలిచింది. ప్రీక్వార్టర్స్‌లో టాన్ తదుపరి పోరులో థాయ్‌లాండ్ మాజీ ప్రపంచ ఛాంపియన్ కున్లావుట్ విటిడ్సార్న్‌ను ఎదుర్కోనున్నాడు.
ఇక లక్ష్య సేన్ మాత్రం ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మరింత ముందుకు వెళ్లాలనే ఆశలను కోల్పోయాడు.
