
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, దర్శకత్వ బాధ్యతలు కూడా చేపడుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RAPO23’. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల పాండిచ్చేరిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ సెట్స్‌లో చిత్రబృందం తొమ్మిది రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. అయితే ప్రతికూల వాతావరణం, వర్షాల కారణంగా షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ఇక ఈ సినిమాలో హీరో పాత్రకు ధీటుగా ఉండే పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ కోసం మేకర్స్ చాలాకాలంగా నటుడి కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెగెటివ్ రోల్ కోసం మొదట మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్‌ను సంప్రదించినట్లు సమాచారం. అయితే డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చలేదని తెలుస్తోంది.
ఆ తర్వాత కోలీవుడ్ నటుడు ఎస్.జే. సూర్యను ఈ పాత్ర కోసం సంప్రదించారట. అయితే ఆయన సుమారు రూ.7 నుంచి రూ.8 కోట్ల వరకు రెమ్యునరేషన్ కోరినట్లు టాక్. ఈ మొత్తం చిత్ర బడ్జెట్ పరిధిని దాటడంతో నిర్మాతలు మరో ఆప్షన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం.
ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్‌ముఖ్‌ను ఈ కీలక పాత్రకు ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రితీష్ ఇప్పటికే విభిన్నమైన పాత్రలతో తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. అంతేకాకుండా రామ్ పోతినేనితో ఆయనకు మంచి స్నేహబంధం ఉండటంతో ఈ కాంబినేషన్‌పై ఆసక్తి నెలకొంది.
రితీష్ దేశ్‌ముఖ్ ఈ పాత్రలో కనిపిస్తే సినిమాకు కొత్త లుక్ రావడంతో పాటు పాన్-ఇండియా స్థాయిలో మరింత క్రేజ్ పెరుగుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన ఎంపికపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘RAPO23’ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. రామ్ పోతినేని స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో విలన్ పాత్రకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
