అమెరికాలో వలసదారులు, వారి పిల్లలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరిని అవలంబిస్తోంది. చట్టబద్ధమైన పత్రాలు కలిగిన వారిపైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 27 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తూ గ్రీన్ కార్డు పొందిన భారత సంతతి మహిళను ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించారు.

ఆమెపై గతంలో నమోదైన డిపోర్టేషన్ కేసును ఫెడరల్ కోర్టు కొట్టివేసినప్పటికీ అధికారులు ఈ చర్యకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా, ఆమెకు అమెరికా పౌరసత్వం కలిగిన ఇద్దరు పిల్లలు, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు. ఇలాంటి కుటుంబ పరిస్థితి ఉన్నప్పటికీ ఆమెను నిర్బంధించడం అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలపై మరోసారి ప్రశ్నలు తలెత్తేలా చేసింది.

గత 27 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వెంకట నర్సమాంబ వాసంశెట్టిని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులు నిర్బంధించారు. గ్రీన్ కార్డ్ కలిగి, 2013 నుంచి అమెరికాలో చట్టబద్ధమైన శాశ్వత నివాసిగా (LPR) ఉన్న ఆమెను దేశం నుంచి బహిష్కరించే ప్రయత్నాన్ని ఇమ్మిగ్రేషన్ జడ్జి గతంలో అడ్డుకున్నారు. అయినప్పటికీ, ఆగస్టు 11న ఐసీఈ చెక్-ఇన్‌కు హాజరైన సమయంలో అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

తన ఇద్దరు మనవరాళ్లతో కలిసి అమెరికాలో నివసిస్తున్న నర్సమాంబపై ప్రభుత్వం గతంలో డిపోర్టేషన్ కేసు నమోదు చేసింది. అయితే ఆ కేసును మే నెలలోనే అమెరికా ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ ఆమెను జార్జియాలోని ఐసీఈ డిటెన్షన్ ఫెసిలిటీలో నిర్బంధించినట్లు ‘న్యూస్‌వీక్’ నివేదించింది.

2022లో కొన్ని నెలల పాటు భారత్‌లో గడిపిన నర్సమాంబ.. ఈ క్రమంలో తన శాశ్వత నివాస హోదాను వదులుకున్నారని అమెరికా ఫెడరల్ ప్రభుత్వం ఆరోపించింది. అయితే, ఆమె కుటుంబ సభ్యులు, న్యాయవాదులు మాత్రం ఈ ఆరోపణలను ఖండించారు. అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను చూసుకునేందుకు ఆమె భారత్‌కు వెళ్లారని, అనంతరం కోవిడ్-19 బారినపడటంతో కోలుకునేందుకు మరికొంత కాలం అక్కడే ఉండాల్సి వచ్చిందని తెలిపారు.

నర్సమాంబకు అమెరికాలోనే కుటుంబం, ఉద్యోగం, ఇల్లు ఉన్నాయని.. ఆమె జీవితానికి, వ్యక్తిగత సంబంధాలకు అమెరికాతోనే బలమైన అనుబంధం ఉందని ఆమె తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు.

అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం, గ్రీన్ కార్డ్ హోల్డర్ ఆరు నెలలకు మించి అమెరికా వెలుపల ఉంటే, అతను లేదా ఆమె శాశ్వత నివాస హోదాను కొనసాగించాలనే ఉద్దేశంపై అధికారులు అదనపు పరిశీలన చేపట్టే అవకాశం ఉంటుంది.